

అమెరికన్ ఫైనాన్సియర్ జెఫ్రీ ఎప్స్టీన్ కు సంబంధించిన రహస్య దస్త్రాలు (ఎప్స్టీన్ ఫైల్స్) పలు దేశాల్లో రాజకీయ, సామాజిక ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాజకుటుంబీకులు, దౌత్యవేత్తలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు వంటి ప్రముఖుల పేర్లు ఇందులో వెలుగులోకి వస్తుండటంతో కొన్ని దేశాల్లో పదవులు కోల్పోయే పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో భారత పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పేరు కూడా తాజాగా చర్చకు వచ్చింది.
లభ్యమైన దస్త్రాల ప్రకారం, 2017 నుంచి 2019 మధ్య ఎప్స్టీన్–అనిల్ అంబానీ మధ్య సంభాషణలు, సందేశాలు కొనసాగినట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యవహారాలు, వ్యాపార అంశాలు, వ్యక్తిగత భేటీల ప్రణాళికలు వంటి విషయాలు వీటిలో ఉన్నాయని సమాచారం. పారిస్‌లో సమావేశాల ప్రణాళికలు, దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సందర్భంగా జరిగిన పరిణామాలపై చర్చలు, న్యూయార్క్ పర్యటన సందర్భంలో కలుసుకోవాలన్న నిర్ణయాలు కూడా ఈ ఫైల్స్‌లో నమోదైనట్లు తెలుస్తోంది. అంతేకాక, అనిల్ అంబానీకి చెందిన రిలయెన్స్ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు సంబంధించిన కొన్ని అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఎప్స్టీన్తో సంబంధాల కారణంగా బ్రిటన్ సహా యూరప్‌లో పలువురు ప్రముఖులు ఇప్పటికే తీవ్ర పరిణామాలను ఎదుర్కొన్నారు. బ్రిటన్ రాజకుమారుడు ప్రిన్స్ ఆండ్రూ రాజహోదా, సౌకర్యాలు కోల్పోగా, ఇతర దేశాల్లోనూ రాజకీయ నేతలు, రాయబారులు విచారణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా న్యాయ శాఖ, ఎప్స్టీన్ ఫైల్స్‌ను అమెరికా కాంగ్రెస్ సభ్యుల సమీక్షకు అనుమతించింది. అయితే, పూర్తి దస్త్రాలను ప్రజలకు విడుదల చేయకుండా, కఠిన నియంత్రణలతో మాత్రమే పరిశీలనకు అందుబాటులో ఉంచనున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!