

యూకే ప్రభుత్వం అంతర్జాతీయ వలసదారుల కోసం ముఖ్యమైన మార్పులను తీసుకురావడానికి సిద్ధమైంది. భారత్ సహా వివిధ దేశాల నుంచి యూకేకు వెళ్లినవారు 'శాశ్వత నివాస అనుమతి (ILR)' కోసం దరఖాస్తు చేసుకునే గడువును ఐదేళ్ల నుండి పదేళ్లకు పెంచే ప్రతిపాదనను గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టినట్లు హోం సెక్రటరీ షబానా మహమూద్ తెలిపారు. ఈ మార్పులు కొత్త ‘ఎర్న్డ్ సెటిల్మెంట్’ మోడల్లో భాగంగా అమలు కానున్నాయి.
ప్రస్తుతం అమలులో ఉన్న ఐదేళ్ల ఆటోమేటిక్ ILR విధానం ఇకపై పదేళ్లకు పెరుగుతుంది. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం, తక్కువ వేతన ఉద్యోగులు 15 సంవత్సరాలు, ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందుతున్న వలసదారులు 20 సంవత్సరాలు వేచి ఉండాల్సి ఉంటుంది.
అయితే నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) వంటి కీలక రంగాల్లో పనిచేసే నిపుణులు, ఎక్కువ ఆదాయం ఉన్న వ్యాపారవేత్తలకు మాత్రం మినహాయింపు ఉంది. వీరు ఐదేళ్లు లేదా అంతకంటే తక్కువ సమయంలోనే ILR పొందే అవకాశం ఉంటుంది.
2021 నుంచి ఇప్పటి వరకు దాదాపు 20 లక్షల వలసదారులు యూకేకు చేరుకున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం వీరు 2026 నుంచి 2030 మధ్య ILR కు అర్హత పొందుతారు. వీరిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ కొత్త మార్పులను ప్రతిపాదించింది.
కొత్త విధానంలో భాగంగా మరికొన్ని కఠిన నిబంధనలు కూడా ఉన్నాయి—వలసదారులకు క్రిమినల్ రికార్డు ఉండకూడదు, ఇంగ్లీష్ భాషలో మంచి ప్రావీణ్యం ఉండాలి, అలాగే సమాజంలో స్వచ్ఛంద సేవలు చేయాలి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!