

వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి రోజున యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక–పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్–యూఏఈ మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై విస్తృతంగా చర్చ జరిగింది. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంతో కలిసి దుబాయ్ ఫుడ్ క్లస్టర్ పని చేయడానికి అంగీకరిస్తూ, యూఏఈకి చెందిన సుమారు 40 సంస్థలు రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు సహకారం అందిస్తామని మంత్రి తెలిపారు.
ఆహార భద్రత, లాజిస్టిక్స్, పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, పునరుత్పాదక శక్తి, పట్టణాభివృద్ధి, పర్యాటకం, మౌలిక వసతుల రంగాల్లో పెట్టుబడి అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు. షరాఫ్ గ్రూప్ ద్వారా మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటు, అమరావతిలో లైట్ గేజ్ స్టీల్ ఫ్రేమింగ్ సాంకేతికతతో ఆధునిక నిర్మాణ యూనిట్, డీపీ వరల్డ్ సహకారంతో పోర్ట్ టెర్మినల్స్ అభివృద్ధి, ఏడీఎన్ఓసీ ద్వారా ఫ్లోటింగ్ స్టోరేజ్–రీగ్యాసిఫికేషన్ యూనిట్, విశాఖలో లూలూ గ్రూప్ మెగా షాపింగ్ మాల్ నిర్మాణంపై చర్చ జరిగింది. యూఏఈతో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ఏపీలో పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, ఎగుమతులు వేగంగా పెరుగుతాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన మంత్రి అల్ మార్రీ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ పాల్గొన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!