

తిరుమలకు వచ్చే భక్తులు శ్రీవారి లడ్డూలను మరింత సులభంగా పొందేలా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. లడ్డూ విక్రయ కేంద్రంలోని ప్రతి కౌంటర్ వద్ద యూపీఐ పేమెంట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఏటా లడ్డూల విక్రయాలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, ఇప్పటివరకు భక్తులు ప్రధానంగా నగదు ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. ఈ ప్రక్రియను ఆధునీకరించేందుకు గతంలో ఆలయం వెనుక భాగంలోని లడ్డూ విక్రయ కేంద్రంలో కియోస్క్ యంత్రాలను టీటీడీ ఏర్పాటు చేసింది.
అయితే, కియోస్క్‌ల వద్ద పెరుగుతున్న రద్దీ, సాంకేతిక సమస్యలు, పేమెంట్ అనంతరం మళ్లీ కౌంటర్ల వద్ద క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితుల కారణంగా కొత్త విధానాన్ని అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రతి కౌంటర్ వద్దే యూపీఐ క్యూఆర్ కోడ్ బోర్డులను ఏర్పాటు చేసి, భక్తులు నేరుగా అక్కడే చెల్లింపు చేసి లడ్డూలు పొందేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ సేవ కోసం ఓ బ్యాంకు కూడా ముందుకు వచ్చినట్టు సమాచారం. తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని కౌంటర్లలో అమలు చేసి, ఫలితాల ఆధారంగా అన్ని కౌంటర్లకు విస్తరించాలనే ఆలోచనలో టీటీడీ ఉంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!