

డక్టైల్ ఐరన్ (డీఐ) పైపుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన రష్మి గ్రూప్, తెలంగాణలో స్టీల్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ప్రపంచ ఆర్థిక వేదిక (WEF)–2026 సదస్సులో భాగంగా దావోస్‌లో, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ బృందం రష్మి గ్రూప్‌తో రూ.12,500 కోట్ల పెట్టుబడికి అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో దాదాపు 12 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉంది.
ఈ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. తెలంగాణ విభిన్న రంగాల్లో వేగంగా పారిశ్రామిక అభివృద్ధి సాధిస్తున్నదని, ముఖ్యంగా తయారీ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులు, మౌలిక సదుపాయాలు, బొగ్గు సరఫరా లింకేజీలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా రష్మి గ్రూప్ ప్రమోటర్ సజ్జన్ కుమార్ పట్వారి, డైరెక్టర్ సంజిబ్ కుమార్ పట్వారి తెలంగాణ రైజింగ్ బృందంతో సమావేశమయ్యారు. ఈ స్టీల్ ప్లాంట్ లేబర్‌పై ఆధారపడి పనిచేసే విధానంతో ఉండి, భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని సంజిబ్ కుమార్ తెలిపారు. గ్రీన్ తయారీ, సర్క్యులర్ ఎకానమీ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశాలపై కూడా చర్చలు జరిగాయి. రష్మి గ్రూప్ ఆసియాలోని 40 దేశాలతో పాటు యూరప్, ఆఫ్రికా, ఉత్తర మరియు దక్షిణ అమెరికా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!