

హైదరాబాద్ నగరంలో ఆహార కల్తీపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్ స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే కల్తీ మాఫియాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, ఆహార కల్తీని ‘హత్యాయత్నం’గా పరిగణిస్తామని హెచ్చరించారు. కల్తీ రక్కసిని పూర్తిగా నిర్మూలించేందుకు పోలీసు మరియు ఆహార భద్రత అధికారులతో కలిసి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపుతున్నట్లు ప్రకటించారు.
ఆహార కల్తీ నివారణ చర్యలపై బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో ఆహార భద్రత విభాగం ఉన్నతాధికారులతో సీపీ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కల్తీకి మూలమైన తయారీ కేంద్రాలపై దృష్టి సారించి దాడులు నిర్వహిస్తామని, ఇందుకోసం స్పష్టమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) రూపొందించి అమలు చేస్తామని తెలిపారు. తనిఖీలు, నమూనాల సేకరణ, సీజ్, అరెస్టుల ప్రక్రియలో ఎలాంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరిస్తామని చెప్పారు.
కల్తీ కేసుల్లో పదే పదే పట్టుబడే వ్యాపారుల లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేయిస్తామని సీపీ హెచ్చరించారు. ప్రజారోగ్యానికి ముప్పుగా మారే కల్తీ మాఫియాపై అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని తెలిపారు. అలాగే, కల్తీపై సమాచారం అందించేందుకు త్వరలోనే ప్రత్యేక వాట్సాప్ లేదా టోల్‌ఫ్రీ నంబర్‌ను ప్రారంభించనున్నట్లు, సమాచారం ఇచ్చే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!