

పొగమంచులో వాహనాలతో ప్రయాణించడం ప్రమాదకరమని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. సంక్రాంతి పండుగ ఆనందం విషాదంగా మారకూడదని సూచిస్తూ, దట్టమైన పొగమంచు ఉన్న సమయంలో ప్రయాణాలు మానుకోవాలని కోరారు. పొగమంచు పూర్తిగా తగ్గి రోడ్డు స్పష్టంగా కనిపించిన తర్వాతే ప్రయాణం ప్రారంభించాలని తెలిపారు.
పండుగ కోసం పల్లెకు చేరాలన్న ఆత్రుత ప్రాణాలపైకి తెచ్చుకోకూడదని సీపీ హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా కమ్మేసిన పొగమంచు వల్ల ఎదురుగా ఉన్నది కనిపించని పరిస్థితి నెలకొందని, ఇలాంటి వేళల్లో డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు. తెల్లవారుజామున లేదా అర్ధరాత్రి వేళల్లో సొంత వాహనాల్లో ప్రయాణం చేయవద్దని సూచించారు.
అత్యవసరంగా పొగమంచులో డ్రైవ్ చేయాల్సి వస్తే తప్పనిసరిగా ఫాగ్ లైట్లు, ఇండికేటర్లు ఆన్ చేయాలని, ముందు వెళ్లే వాహనానికి తగినంత సురక్షిత దూరం పాటించాలని చెప్పారు. రోడ్డు ఖాళీగా ఉందని వేగంగా వెళ్లకూడదని సూచిస్తూ, ఆలస్యమైనా సరే క్షేమంగా ఇంటికి చేరడమే నిజమైన పండుగ అని సీపీ సజ్జనార్ గుర్తు చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!