

చిన్నగా కనిపించే కోడి కత్తి తగిలితే రక్తం ధారలుగా పారుతుంది. ఒక్క దెబ్బతోనే గాయపడిన కోడి క్షణాల్లో కుప్పకూలిపోతుంది. కోడి పందేల బరుల్లో కోడి కత్తుల పాత్ర అత్యంత కీలకమైనది. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న తరుణంలో ప్రతి గ్రామంలోనూ కోడి కత్తుల గురించే చర్చ జరుగుతోంది.
విరగదు.. వంగదు..
కోడి కత్తులను ఆరు అంచెల్లో సాన పెడతారు. విరగకుండా, మొన వంగకుండా ఉండాలంటే అత్యంత గట్టిదనం అవసరం. అందుకే భారీ వాహనాల చక్రాల బేరింగుల్లో ఉపయోగించే స్టెయిన్లెస్ స్టీల్‌తో వీటిని తయారు చేస్తారు. మరింత బలం కోసం ఆరు సార్లు కొలిమిలో కాల్చుతారు.
కత్తి కట్టే వారే కీలకం
సంక్రాంతి కోడి పందేల బరుల్లో పుంజు కాళ్లకు కత్తులు కట్టే వారికి మంచి గిరాకీ ఉంటుంది. పండగ నాలుగు రోజుల పాటు వీరికి భారీ డిమాండ్ ఉంటుంది. కత్తి కట్టడంపైనే పందెం ఫలితం ఆధారపడి ఉంటుందని నిర్వాహకులు భావిస్తారు.
పందెం పుంజు కుడికాలి పిల్లవేలికి కత్తిని కడతారు. పందెం జరుగుతున్నంతసేపూ కత్తి కట్టిన వ్యక్తి పుంజు కాళ్లను గమనిస్తూనే ఉంటాడు. కత్తి విరిగినా లేదా దిశ మారినా పందెం నిలిపివేసి సరిచేసి మళ్లీ ప్రారంభిస్తారు. పందెం గెలిస్తే లక్షల రూపాయలు చేతులు మారుతాయి. అందుకే కత్తి కట్టే వారికి రోజుకు రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు పారితోషికం ఇస్తారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో కేంద్రాలు
రాష్ట్రంలో కోడి కత్తుల తయారీ కేంద్రాలు ఎక్కువగా పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం, నూజివీడు, గురవాయిపాలెం, ముప్పర్తిపాడు ప్రాంతాల్లో ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో ముమ్మిడివరం, కాట్రేనికోన, ఎదుర్లంక, సామర్లకోట, అనపర్తి ప్రాంతాల్లో తయారీదారులు ఉన్నట్లు సమాచారం.
ఉభయ గోదావరి జిల్లాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకకు కూడా కోడి కత్తులు తరలిస్తున్నారు. సంక్రాంతి సీజన్లో ఈ వ్యాపారం సుమారు రూ.5 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
రోజుకు పది కాదు.. ఐదే!
ఒక వ్యక్తి రోజుకు 5 నుంచి 6 కత్తుల వరకు మాత్రమే తయారు చేయగలడు. అందుకే సంక్రాంతి సీజన్ కోసం ఏడాది పొడవునా వీటి తయారీ కొనసాగుతుంది. గతంలో ఒక్క కత్తి ధర రూ.200 నుంచి రూ.300 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.1000 వరకు పలుకుతోంది. ముడి ఇనుమును చెన్నై, విజయవాడ, తిరువూరు వంటి ప్రాంతాల నుంచి తెస్తారు. ఒక కత్తిని ఒక్క పందెంకు మాత్రమే ఉపయోగిస్తారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!