

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ రెండు రాష్ట్రాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో ద్రోణి ప్రభావంతో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపించనున్నాయి. అల్లూరి, శ్రీకాకుళం, పోలవరం, కర్నూలు, నంద్యాల, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశముంది.
ఇక మన్యం, పోలవరం, తూర్పు గోదావరి, ఏలూరు, విజయనగరం జిల్లాల్లో మాత్రం తీవ్రమైన వడగాలులు వీచే అవకాశముందని అధికారులు తెలిపారు.
ప్రజలు ఈ భిన్న వాతావరణ పరిస్థితుల పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే అకాల వర్షాలు ప్రారంభమయ్యాయి. ఉత్తర తెలంగాణలో ఎక్కువగా వర్షపాతం నమోదవుతోంది. అదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో నిన్న అర్ధరాత్రి నుంచి పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి. ఈ వర్షాలు ఉత్తర తెలంగాణ నుంచి హైదరాబాద్ వైపు విస్తరిస్తున్నాయి. దీంతో మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ ప్రాంతాల్లో వాతావరణం మారి చల్లగా మారింది. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా రాబోయే రెండు గంటల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!