

హైదరాబాద్ నగరంలో ప్రమాదకరమైన చైనా మాంజా విక్రయాలు, వినియోగం పై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. నగరవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో ఇప్పటివరకు మొత్తం 103 కేసులు నమోదు చేశారు.
ఈ చర్యల్లో భాగంగా 143 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.1.24 కోట్ల విలువైన చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. అలాగే మొత్తం 5,226 మాంజా బాబిన్లను సీజ్ చేశారు.
ప్రమాదాలకు కారణమవుతున్న చైనా మాంజాను పూర్తిగా నియంత్రించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న ఈ మాంజా పై ఎలాంటి సడలింపులు ఉండవని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు. చైనా మాంజా విక్రయాలు లేదా వినియోగం కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు.
చైనా మాంజా వినియోగం పై సిటీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనా మాంజాను కొనుగోలు చేసినా, విక్రయించినా, లేదా వినియోగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ రకమైన మాంజాతో గాలి పటాలు ఎగరవేసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చైనా మాంజా వల్ల ఎవరైనా గాయపడితే, ఆ ఘటనకు బాధ్యులైన వ్యక్తుల పై కూడా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి సడలింపులు ఉండవని స్పష్టం చేశారు. అలాగే, చైనా మాంజా విక్రయానికి పాల్పడుతున్న వ్యక్తుల పై అవసరమైతే పీడీ యాక్ట్ (ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్) కూడా అమలు చేస్తామని సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!