

అర్హులైనవారి పేర్లను పశ్చిమబెంగాల్ ఎన్నికల జాబితా నుంచి తొలగించబోమని ముఖ్య ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడమే తమ లక్ష్యమని తేల్చిచెప్పారు. మంగళవారం కోల్‌కతాలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఓటరుకూ ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తామని నొక్కి చెప్పారు. ‘ఓటు వేయడానికి అర్హులైన ప్రతి ఒక్కరి పేరూ జాబితాలో ఉండాలి, అలాగే అనర్హుల పేరు జాబితాలో ఉండకూడదు అనేదే లక్ష్యం’ అన్నారు. బెంగాల్లో సర్ ప్రక్రియపై విమర్శల గురించి మాట్లాడుతూ ‘12 రాష్ట్రాల్లో ఎలా చేశామో.. బెంగాల్లోనూ అలాగే చేశాం’ అని చెప్పారు. సర్ ప్రక్రియ తర్వాత ఫిబ్రవరి 28న ప్రచురించిన ఓటర్ల జాబితాతోపాటు అనుబంధ ఓటర్ల జాబితాలనూ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నామని తెలిపారు.
‘శాంతిభద్రతలపై రాష్ట్ర యంత్రాంగం సన్నద్ధత ఆధారంగా బెంగాల్లో ఎన్ని దశల్లో ఎన్నికలు నిర్వహించాలనేది నిర్ణయిస్తాం’ అన్నారు. రాజకీయ నాయకులు హింసకు, ఓటర్లను, ఎన్నికల అధికారులను బెదిరించడానికి ప్రయత్నిస్తే సహించే ప్రసక్తే లేదని సీఈసీ తేల్చిచెప్పారు. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈసీ సూచనల మేరకు నిక్కచ్చిగా పనిచేయాలన్నారు. నిర్లక్ష్యాన్ని సహించబోమని చెప్పారు. రాజకీయ పార్టీల విమర్శలపై మాట్లాడుతూ.. ‘రాజకీయ పార్టీల వ్యాఖ్యలపై ఈసీ వ్యాఖ్యానించడం తగదు. రాజకీయ ప్రకటనలకు మేం స్పందించం. రాజ్యాంగం ప్రకారమే ఈసీ పనిచేస్తుంది’ అన్నారు.
ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ బూత్‌లలో 100 శాతం వీడియో రికార్డింగ్ నిర్వహిస్తామన్నారు. ‘ఎన్నికల దశ.. పశ్చిమబెంగాల్‌కు గర్వకారణం’ అనే ఈసీ నినాదాన్ని సీఈసీ వెల్లడించారు. కాగా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు కోల్‌కతా పర్యటనలో నిరసన సెగ తగిలింది. మంగళవారం ఉదయం ఆయన దక్షిణేశ్వర్ కాళి ఆలయాన్ని సందర్శించినప్పుడు కొందరు నల్ల జెండాలు, ‘గో బ్యాక్’ నినాదాలతో ఆందోళన నిర్వహించారు. ఆదివారం రాత్రి ఆయన కోల్‌కతాకు విచ్చేసినప్పుడు విమానాశ్రయంలోనూ అలాంటి నిరసనే ఎదురైంది. సోమవారం కాళిఘాట్ ఆలయాన్ని సందర్శించినప్పుడు కూడా అలాంటి నిరసనే ఆయన ఎదుర్కొన్నారు. అయినప్పటికీ షెడ్యూల్ ప్రకారం తన కార్యక్రమాలను ఆయన కొనసాగించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!