

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో పర్యటించిన ఆయన విమానాశ్రయ పనులను పరిశీలించి, జీఎంఆర్ సంస్థ ప్రతినిధులతో చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుతం పనులు సుమారు 97 శాతం పూర్తయ్యాయని, జులై లేదా ఆగస్టు నెలల్లో విమానాశ్రయాన్ని ప్రారంభించే అవకాశముందని చెప్పారు. ఎర్త్ రన్‌వే పనులు పూర్తయ్యాయని, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పనులు కూడా 95 శాతం పూర్తి అయ్యాయని వెల్లడించారు. అలాగే అనుసంధాన రహదారుల అభివృద్ధి పనులు త్వరలో పూర్తి కానున్నాయని, రాష్ట్రంలో మరో ఆరు కొత్త విమానాశ్రయాల నిర్మాణం కూడా చేపడుతున్నామని తెలిపారు.
ఇక విమానాశ్రయ నిర్మాణంపై గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. ఎర్రబస్సు కూడా రాని ప్రాంతంలో ఎయిర్‌పోర్టు అవసరమేమిటని అప్పట్లో వైకాపా నేతలు ప్రశ్నించారని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు అదే ప్రాజెక్ట్‌ను తమ ప్రభుత్వం ప్రారంభించినట్లు చెప్పడం విరుద్ధంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు అదితి గజపతిరాజు, లోకం నాగమాధవి తదితరులు పాల్గొన్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!