

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో మహిళా సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) ద్వారా నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాల సంఖ్య ఈసారి గణనీయంగా పెరిగింది. ప్రభుత్వం మొత్తం 8,251 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, అందులో 3,403 ఐకేపీ సెంటర్లను మహిళా సంఘాలకు కేటాయించింది. గతంలో కేవలం 1,500 కేంద్రాలకే పరిమితమైన ఈ సంఖ్య ఇప్పుడు రెట్టింపు కావడం విశేషం. ఇప్పటికే 500 కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి, ఈ నెలాఖరు నాటికి అన్ని కేంద్రాలు పూర్తిగా పనిచేయనున్నాయి.
గత సీజన్లలో మహిళా సంఘాలు గణనీయమైన ఆదాయం పొందాయి. వానాకాలంలో రూ. 80.60 కోట్లు, యాసంగిలో రూ. 81.65 కోట్లు కమీషన్‌గా పొందగా, ఈసారి ధాన్యం సేకరణ పెరగడంతో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రతి సీజన్లో సుమారు 40 లక్షల మంది రైతుల నుంచి 25 లక్షల టన్నుల ధాన్యాన్ని ఐకేపీ సెంటర్ల ద్వారా సేకరిస్తున్నారు. మహిళా సంఘాల నిర్వహణలో రైతులకు మెరుగైన సేవలు అందుతున్నాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తున్న శక్తి వారేనని మంత్రి సీతక్క తెలిపారు. భవిష్యత్తులో సాంకేతిక శిక్షణతో ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని అధికారులు పేర్కొన్నారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!