

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ ఆహార మార్కెట్లపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. చమురు ధరల పెరుగుదల, ఇంధన కొరత కారణంగా గ్లోబల్ మార్కెట్లు ఒత్తిడికి లోనవుతున్నాయి. ఈ పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ ఆహార ధరల సూచీ ఆరు నెలల గరిష్ఠ స్థాయికి చేరినట్లు ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏఓ) వెల్లడించింది. ప్రస్తుత ఉద్రిక్తతలు కొనసాగితే ఆహార ధరలు మరింత పెరిగే అవకాశముందని సంస్థ హెచ్చరించింది.
ఎఫ్‌ఏఓ నివేదిక ప్రకారం, ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో అంతర్జాతీయ ఆహార ధరలు 2.4 శాతం పెరిగి 128.5 పాయింట్లకు చేరాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 1 శాతం ఎక్కువ. నెలవారీ ప్రాతిపదికన వంట నూనెల ధరలు 5.1 శాతం, చక్కెర ధరలు 7.2 శాతం, గోధుమల ధరలు 4.3 శాతం పెరిగాయి. అలాగే ఎరువులు, మొక్కజొన్న ధరలు కూడా పెరిగాయి. ఇథనాల్‌కు డిమాండ్ పెరగడం మరో ముఖ్య అంశంగా గుర్తించారు. అయితే ఈ పరిస్థితుల్లో కూడా బియ్యం ధరలు తగ్గుముఖం పట్టడం కొంత ఊరటనిచ్చే విషయం.
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా చమురు ధరలు పెరగడం, రవాణా వ్యవస్థలో అంతరాయం కలగడం ఈ పరిస్థితులకు ప్రధాన కారణాలుగా ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. దీని ప్రభావం ఉత్పత్తి రంగంపై పడుతుండటంతో, అంతర్జాతీయ మార్కెట్లు ద్రవ్యోల్బణ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. యుద్ధం కొనసాగితే సరఫరా గొలుసు దెబ్బతిని, ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!