

తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మృతులలో అగ్రనేతలు ఉన్నారని, ముఖ్యంగా అగ్రనేత దేవ్‌జీ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్ ప్రాంతంలో భద్రతా బలగాలు విస్తృతంగా కూంబింగ్ చర్యలు చేపట్టాయి.
కర్రెగుట్టలో ఆపరేషన్-2లో భాగంగా సుమారు 5,000 మంది సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మావోయిస్టు అగ్రనేతలు దేవ్‌జీ, సోది వంటి కీలక నేతలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. మరోవైపు కొంతమంది అగ్రనేతలు లొంగుబాటుకు సిద్ధమవుతున్నారనే సమాచారం కూడా వెలువడుతోంది. ఆపరేషన్ కగార్‌కు ఇంకా 40 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది.
కేంద్ర హోంశాఖ మావోయిస్టు కార్యకలాపాలపై మరింత దృష్టి సారించగా, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కూడా పరిస్థితులను సమీక్షిస్తోంది. 2024 జనవరి 1న ప్రారంభమైన ఆపరేషన్ కగార్ తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర, ఒడిశా వంటి ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతోంది. పలువురు కీలక నేతలు సహా వందలాది మావోయిస్టులు ఎదురుదాడుల్లో మృతి చెందినట్లు సమాచారం. రంపచోడవరం అడవుల్లో జరిగిన మరో భారీ ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత, గెరిల్లా వ్యూహకర్త మడివి హిడ్మా కూడా మరణించినట్లు వెల్లడైంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు ప్రభావాన్ని పూర్తిగా నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!