

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో పనిచేస్తున్న సిబ్బంది మరియు ఉద్యోగుల ట్రేడ్ యూనియన్ అయిన HCASE నేటి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. పెండింగ్‌లో ఉన్న ఓవర్‌టైమ్ (OT) బకాయిలు చెల్లించడం, గ్రౌండ్ సిబ్బందికి కన్వేయన్స్ అలవెన్సులు ఇవ్వడం వంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వారు కోరుతున్నారు. అలాగే కొత్తగా ప్రతిపాదించిన HR కన్సల్టెన్సీ నియామకాన్ని వెంటనే రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
ఉద్యోగుల ప్రకారం, గతంలో మూడు నెలల పాటు జీతాలు లేకపోయినా సంస్థ కోసం అంకితభావంతో పనిచేశామని తెలిపారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్‌తో పాటు ఉద్యోగులందరికీ క్యాష్‌లెస్ ఆరోగ్య బీమా అందించాలని కూడా వారు కోరుతున్నారు. తమ సమస్యలపై ఇప్పటికే మేనేజ్మెంట్కు అనేక లేఖలు రాసినా స్పందన రాలేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.
డిమాండ్లు నెరవేర్చే వరకు ఉప్పల్ స్టేడియంలో పనులు నిలిపివేస్తామని యూనియన్ హెచ్చరించింది. సమ్మె కారణంగా మ్యాచ్‌ల నిర్వహణకు అంతరాయం కలిగితే దానికి మేనేజ్మెంటే బాధ్యత వహించాలని కూడా స్పష్టం చేసింది. అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నామని, ఇక తమ ఓపిక నశించిందని ఉద్యోగులు పేర్కొన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!