

తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. వరుస సెలవుల కారణంగా దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో క్యూ లైన్లు బయటకు విస్తరించి శిలాతోరణం వరకు కిలోమీటర్ల మేర కొనసాగుతున్నాయి. ఎండ తీవ్రత ఉన్నప్పటికీ, భక్తులు ఎంతో ఓపికతో స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు.
టోకెన్లు లేని సాధారణ భక్తులకు శ్రీవారి దర్శనం పొందడానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. ఆదివారం ఒక్కరోజే మొత్తం 86,091 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 29,664 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు.
భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి ఒక్కరోజే రూ.4.21 కోట్ల ఆదాయం లభించింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని, క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది పాలు, తాగునీరు, అన్నప్రసాదం వంటి సేవలను నిరంతరాయంగా అందిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!