

తెలంగాణ ఆరోగ్యశాఖలో మరోసారి ఉద్యోగాల పండుగ నెలకొంది. ప్రభుత్వ హాస్పిటళ్లలో ఖాళీగా ఉన్న 1,284 ల్యాబ్ టెక్నీషియన్ (గ్రేడ్–2) పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయింది. ఈ పోస్టులకు సంబంధించిన సెలక్షన్ లిస్ట్‌ను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం విడుదల చేశారు. గతేడాది చివర్లో జారీ చేసిన నోటిఫికేషన్‌కు 24,045 మంది దరఖాస్తు చేయగా, అందులో 23,323 మంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కు హాజరయ్యారు. ఎంపికైన వారి జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సిద్ధం చేసి అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఈ సందర్భంలో మంత్రి మాట్లాడుతూ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 9 వేలకుపైగా పోస్టులను ఇప్పటికే భర్తీ చేశామని, మరో 7 వేలకుపైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ వంటి కీలక పోస్టులతో పాటు వైద్య సేవలకు అవసరమైన ఇతర స్థానాలు కూడా పెద్ద ఎత్తున భర్తీ చేస్తున్నామని మంత్రి వివరించారు. మునుపటి ప్రభుత్వ కాలంలో సిబ్బంది కొరతతో వెలవెలబోయిన ప్రభుత్వ హాస్పిటళ్లు ఇప్పుడు డాక్టర్లు, సిబ్బందితో కిక్కిరిసిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. సిబ్బంది పెరగడంతో పేషెంట్లకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని తెలిపారు. మిగిలిన పోస్టుల భర్తీని కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!