

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. తమిళనాడులో పార్టీ భవిష్యత్ వ్యూహాల విషయంలో కేంద్ర నాయకత్వంతో విభేదాలు తలెత్తాయని ఆయన వెల్లడించారు. గత 18 నెలలుగా పార్టీ అగ్రనేతలతో చర్చలు జరిపినా ఏకాభిప్రాయం కుదరలేదని పేర్కొన్నారు. తాను పార్టీని వీడే నిర్ణయాన్ని ఇప్పటికే 2025 డిసెంబర్‌లోనే తెలియజేశానని, ఎన్నికల బాధ్యతలు పూర్తయ్యాక ఇప్పుడు అధికారికంగా బయటకు వచ్చానని తెలిపారు.
బీజేపీ తన రాజకీయ జీవితంలో ఇచ్చిన అవకాశాలకు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రధాని నరేంద్ర మోదీ పై తనకు ఎల్లప్పుడూ గౌరవం ఉంటుందని అన్నామలై స్పష్టం చేశారు. ఇకపై ‘సామాన్యుడి రాజకీయం’ అనే భావనతో కొత్త రాజకీయ ఉద్యమాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. తమిళనాడులో వ్యక్తి ఆరాధన రాజకీయాలకు ప్రత్యామ్నాయాన్ని అందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రముఖ నటుడు రజనీకాంత్ కలిసి పనిచేయాలని ఆహ్వానించినప్పటికీ, తాను స్వతంత్ర రాజకీయ మార్గాన్నే ఎంచుకున్నట్లు వెల్లడించారు. భవిష్యత్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తానని కూడా స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!