

బిహార్‌ను అత్యధిక కాలం పాలించిన ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ సీఎం పదవిని వీడి రాజ్యసభకు వెళ్లడం ఖాయమైంది. పది రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 37 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 16న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల చివరి రోజున నీతీశ్ కుమార్‌తో పాటు భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, సీనియర్ నేత ఉపేంద్ర కుశ్వాహా, కేంద్రమంత్రి రామ్‌నాథ్ ఠాకుర్ కూడా పట్నాలో తమ నామినేషన్లు సమర్పించారు. శాసనసభలో ఎన్డీయేకు స్పష్టమైన మెజారిటీ ఉండటంతో బిహార్‌లో ఈ అభ్యర్థుల ఎన్నిక లాంఛనమేనని భావిస్తున్నారు.
రాజ్యసభకు వెళ్లినా బిహార్ రాష్ట్రంతో తన బంధం కొనసాగుతుందని నీతీశ్ కుమార్ తెలిపారు. కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి తాను పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు. అయితే ఆయన సీఎం పదవి వదిలి రాజ్యసభకు వెళ్లడాన్ని జేడీయూ కార్యకర్తలు వ్యతిరేకిస్తూ పట్నాలో నిరసనలు చేపట్టారు. మరోవైపు నీతీశ్ రాజీనామాతో బిహార్‌లో తొలిసారిగా భాజపా చేతికి సీఎం పదవి దక్కే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరి సీఎం అయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!