

హైదరాబాద్ నగరంలోని ఎల్‌బీ స్టేడియం సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ క్రీడాస్ఫూర్తికి వేదికగా మారి ప్రజాప్రతినిధుల సందడితో కోలాహలంగా కనిపించింది. “Fit Leaders – Fit State” అనే సందేశాన్ని ముందుకు తీసుకువెళ్తూ “తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్, కల్చరల్ మీట్ – మొదటి ఎడిషన్” కార్యక్రమం ఉత్సాహభరితంగా ప్రారంభమైంది. నాయకులు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం కూడా ఆరోగ్యంగా ఉంటుందని ఈ కార్యక్రమం ద్వారా సందేశం ఇచ్చారు. బడ్జెట్ సమావేశాల సమయంలో నిర్వహించే శాసనమండలి, శాసనసభ సభ్యుల కోసం గత 14 సంవత్సరాలుగా నిలిచిపోయిన క్రీడా సంప్రదాయాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తిరిగి ప్రారంభించారు. ప్రారంభంతో పాటు సహచర మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి వివిధ క్రీడల్లో పాల్గొని అందరిలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మరియు ఇతర క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎల్‌బీ స్టేడియంకు ఉన్న గొప్ప చరిత్రను గుర్తుచేస్తూ, ప్రపంచ స్థాయి క్రీడాకారులు ఈ మైదానంలో ఆడటమే కాకుండా శిక్షణ పొందిన విషయాన్ని పేర్కొన్నారు. ఎల్‌బీ స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. అలాగే గచ్చీబౌలిలో ఉన్న క్రీడా మైదానాలను రూ.700 కోట్లతో ప్రపంచస్థాయి క్రీడా సదుపాయాలతో అభివృద్ధి చేయనున్నామని చెప్పారు. గచ్చీబౌలిలో 2034 ఒలింపిక్స్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, మూడు నెలల్లో అక్కడ అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. వచ్చే మూడేళ్లలో అన్ని క్రీడా కార్యక్రమాలను గచ్చీబౌలి మైదానాల్లోనే నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని, బేగంపేట హాకీ మైదానాన్ని కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
అదేవిధంగా గత చరిత్రను ప్రస్తావిస్తూ 1950–60 దశకంలో భారత ఫుట్‌బాల్ జట్టు ప్రపంచ స్థాయిలో నాల్గవ స్థానంలో నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పట్లో హైదరాబాద్ నగరానికి చెందిన ఏడుగురు క్రీడాకారులు జట్టుకు ప్రాతినిధ్యం వహించారని తెలిపారు. ఒకప్పుడు హాకీ, ఫుట్‌బాల్, క్రికెట్ వంటి క్రీడలు రాష్ట్రానికి మంచి పేరు తెచ్చాయని, కానీ ప్రస్తుతం క్రీడల్లో వెనుకబడ్డామని పేర్కొన్నారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించి క్రీడారంగాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత క్రీడలు తగ్గిపోయాయని గుర్తుచేస్తూ, ప్రజా ప్రభుత్వం క్రీడా పాలసీని తీసుకువచ్చిందని తెలిపారు. గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్ పోటీలను నిర్వహించి ప్రతిభను వెలికితీస్తున్నామని చెప్పారు. 140 కోట్ల జనాభా ఉన్నప్పటికీ అంతర్జాతీయ క్రీడల్లో సరైన స్థాయికి చేరుకోలేకపోతున్నామని, దక్షిణ కొరియా క్రమశిక్షణను మనం అనుసరించాలని సూచించారు. క్రీడాస్ఫూర్తిని పెంచేందుకు ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీని హైదరాబాద్‌కు ఆహ్వానించామని తెలిపారు. క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రభుత్వం గుర్తించి గౌరవిస్తుందని, ప్రతి ఒక్కరూ క్రీడలపై ఆసక్తి పెంచుకుని రాణించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అనంతరం పలు క్రీడా పోటీలు నిర్వహించగా, ముఖ్యమంత్రి స్వయంగా ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పాల్గొని కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తీసుకువచ్చారు.





















.webp&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!