

దిత్వా తుఫాన్ ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. శ్రీలంక–తమిళనాడు ప్రాంతాల్లో ఇప్పటికే తీవ్ర ప్రభావం చూపించిన దిత్వా, ఇప్పుడు ఏపీలోని దక్షిణ కోస్తా—రాయలసీమ జిల్లాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రాబోయే రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశంతో, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అత్యధిక వర్షాలు పడే అవకాశం ఉండగా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు–పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని అధికారులు వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు కడపలో 2 ఎన్డీఆర్ఎఫ్ టీంలు, వెంకటగిరిలో 3 ఎస్డీఆర్ఎఫ్ టీంలు సిద్ధంగా ఉంచారు.
తుఫాను ప్రభావాన్ని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అధికారులు తెలిపారు. జిల్లా—మండలాల స్థాయిలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మత్స్యకారులను వెంటనే తీరం చేరేలా సూచించగా, రైతులకు కూడా పంటల రక్షణకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు పంపుతున్నారు. ఫ్లాష్ ఫ్లడ్స్ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా ఫుల్ అలర్ట్‌లో ఉన్నట్లు విపత్తు నిర్వహణ విభాగం ప్రకటించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!