

ఇండిగో విమాన సర్వీసుల్లో ఏర్పడిన తీవ్ర అంతరాయాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ కు డీజీసీఏ (DGCA) షోకాజ్ నోటీసు జారీ చేసింది. ప్రణాళిక, పర్యవేక్షణలో లోపాలు ఎందుకు జరిగాయో, వాటి కారణంగా దేశవ్యాప్తంగా వేలాది ప్రయాణికులు ఇబ్బందులు పడటంపై సమగ్రమైన వివరణ ఇవ్వాలని డీజీసీఏ ఆదేశించింది. 24 గంటల్లో సమాధానం పంపాలని నోటీసులో పేర్కొంది. ఇదిలా ఉండగా, పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఇండిగో సీఈవో, సీనియర్ అధికారులతో సమావేశమై తాజా పరిస్థితిని సమీక్షించారు. విమాన సర్వీసులను వెంటనే సాధారణ స్థితికి తీసుకురావాలని, ప్రయాణికులకు రిఫండ్ సహా అవసరమైన అన్ని సౌకర్యాలు అందించాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కారణాలను వెలికి తీసేందుకు, ఉపశమన చర్యలను సూచించేందుకు నాలుగు సభ్యుల విచారణ కమిటీని డీజీసీఏ ఇప్పటికే ఏర్పాటు చేసింది.
సిబ్బంది కొరత కారణంగా గత కొన్ని రోజులుగా ఇండిగో విమానాలు భారీ స్థాయిలో రద్దవుతూ వచ్చాయి. శుక్రవారం 1,600 ఫ్లైట్లు, శనివారం 800 ఫ్లైట్లు రద్దయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా వేలాది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో పౌర విమానయానశాఖ ప్రకటన విడుదల చేస్తూ, దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయని, చెక్-ఇన్, చెక్-అవుట్ ప్రక్రియలు సజావుగా జరుగుతున్నాయని తెలిపింది. అయితే ఇండిగో సర్వీసులు పూర్తిగా స్థిరపడటానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!