
రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం రూ.9,000 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు ఆర్థికశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎకరానికి రూ.6,000 చొప్పున సుమారు 1.50 కోట్ల ఎకరాలకు ఈ సాయం అందించనున్నారు. ఈ నెల 22న సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్ పామ్ కర్మాగారం ప్రారంభోత్సవం సందర్భంగా జరిగే సభలో సీఎం మొదటి విడతగా రూ.3,590 కోట్లను 73 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
మరో 20 రోజుల తర్వాత రెండో విడతగా రూ.2,650 కోట్లు, ఏప్రిల్ నెలాఖరులో మూడో విడతగా రూ.2,760 కోట్లు విడుదల చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుందని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే మూడు విడతల్లో రైతులకు పెట్టుబడి సాయం అందించింది. తాజాగా విడుదల కానున్న నిధులతో నాలుగో సీజన్‌కు సాయం అందుతుంది. యాసంగి సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నర్మెటలో జరిగే సభలో ఆయిల్ పామ్ కర్మాగారం ప్రారంభంతో పాటు రూ.40 కోట్లతో నిర్మించే రిఫైనరీకి శంకుస్థాపన కూడా జరగనుంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు హాజరుకానున్నారు.

.webp&w=3840&q=75)







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!