

తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత కొంతకాలంగా నిలిచిపోయిన 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. తొలి విడతగా రూ. 259.36 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సకాలంలో జరగకపోవడంతో గత రెండేళ్లుగా ఈ నిధుల విడుదల నిలిచిపోయింది. అయితే, ఇటీవల పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడం, నూతన పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టడంతో నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. రాష్ట్రానికి మొత్తం సుమారు రూ. 3000 కోట్ల వరకు నిధులు రావాల్సి ఉండగా, తొలి విడతగా ఈ మొత్తాన్ని విడుదల చేశారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క నిరంతర చొరవ, కేంద్ర మంత్రులతో జరిపిన సంప్రదింపులు, రాష్ట్ర అధికారుల కృషితో ఈ నిధులు విడుదలయ్యాయి. తొలి విడత నిధుల విడుదలపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. గ్రామాల అభివృద్ధికి ఈ నిధులు ఎంతో దోహదపడతాయని పేర్కొన్న ఆమె, మిగిలిన పెండింగ్ నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!