

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నగర నిర్మాణం ఒక అరుదైన అవకాశమని ఆర్థిక సర్వే 2025–26 పేర్కొంది. గ్రీన్ఫీల్డ్ నగరంగా అమరావతిని అభివృద్ధి చేయడం ద్వారా జీవన విధానాన్ని ముందుగానే ప్రణాళికాబద్ధంగా రూపకల్పన చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. నగరాలు కిక్కిరిసిపోయిన తర్వాత మార్పులు చేయడం కంటే, ప్రారంభ దశ నుంచే మౌలిక సదుపాయాలు, నివాసాలు, రవాణా, పర్యావరణాన్ని సమగ్రంగా డిజైన్ చేయడం ద్వారా భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన నగరాన్ని నిర్మించవచ్చని వివరించింది.
విద్య, పరిశోధన, ఇతర రంగాల అనుసంధానంతో ఎదిగే నగరాలే వేగంగా అభివృద్ధి చెందుతాయని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. జీవన సౌలభ్య సూచీల్లో దేశంలోని అగ్ర పది నగరాల్లో తిరుపతి, విజయవాడలకు స్థానం లభించిందని వెల్లడించింది. ఈ నగరాలు బెంగళూరు, దిల్లీ, ముంబయిలా తీవ్రమైన జనాభా ఒత్తిడిని ఎదుర్కొనడం లేదని పేర్కొంది. నిజమైన నివాసయోగ్య నగరాలంటే కేవలం మౌలిక సదుపాయాలే కాకుండా ప్రజల సమయం, భద్రత, సృజనాత్మకత, భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేవిగా ఉండాలని నివేదిక పేర్కొంటూ, అభివృద్ధి దిశగా సాగుతున్న అమరావతిని అందుకు ఉత్తమ ఉదాహరణగా అభివర్ణించింది.










.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!