

‘ధర్మో రక్షతి రక్షితః’.. శ్రీవారి ఆలయం ముందు దర్శనమిచ్చే ఈ ఆదర్శ వాక్యం అర్థం ఏంటో అందరికీ తెలిసిందే. కానీ ఆ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నవారే అధర్మానికి చేయూత ఇస్తే? అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన చోట, పవిత్రమైన ఏడుకొండల సాక్షిగా అపచారాలకు వంతపాడితే? అలాంటి అధికారిపై కూటమి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా చర్యలు చేపట్టింది. కల్తీకి తలుపులు తెరిచి, అవినీతిపై కళ్లుమూసిన అనిల్‌కుమార్ సింఘాల్‌పై వేటు వేసింది.
గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణంలో నాటి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలు ఉన్నాయి. నెయ్యి టెండర్ల నిబంధనలను సడలించడంలో ఆయన ప్రమేయం ఉందన్న అంశాలపై సిట్ విచారణ చేపట్టింది. ఆ నివేదిక ప్రభుత్వానికి అందడంతో సింఘాల్‌పై బదిలీ వేటు పడింది. తప్పు చేసినా, ఉపేక్ష ఉండదన్న స్పష్టమైన సంకేతాన్ని ప్రభుత్వం ఈ చర్యతో పంపింది.
2025 సెప్టెంబరు 10న ఈవోగా బాధ్యతలు చేపట్టిన సింఘాల్.. డిప్యూటీ ఈవోల బదిలీల ప్రక్రియను ప్రారంభించారు. అయితే తనకు అనుకూలమైన వారిని ఆలయ ఉన్నత పదవుల్లో నియమించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు రావడంతో ఆ ప్రక్రియ అర్థాంతరంగా నిలిచిపోయింది. ఫలితంగా పాత అధికారులు యథావిధిగా కొనసాగాల్సి వచ్చింది. ఇక తిరుమల రిసెప్షన్ విభాగంలో అత్యంత కీలకమైన ఆర్-1, ఆర్-2 పోస్టుల్లో ఇద్దరు ఉండాల్సి ఉండగా, ఒక్కరితోనే పనులు నెట్టుకొచ్చారు. ఖాళీలను భర్తీ చేయడంలోనూ, సిబ్బంది సమన్వయంలోనూ సింఘాల్ నిర్లక్ష్యం చూపారన్న విమర్శలు వెల్లువెత్తాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఏఎస్ అధికారి శ్యామలరావు ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. కల్తీ నెయ్యి వ్యవహారాన్ని బయటపెట్టి, నందిని నెయ్యిని తిరిగి ప్రవేశపెట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే బైరాగిపట్టెడలో జరిగిన తొక్కిసలాట ఘటన, ఆపై ఛైర్మన్‌తో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో ఆయన బదిలీ అయ్యారు. ఆ స్థానంలో వచ్చిన సింఘాల్ మాత్రం గతంలోలాగే కేవలం తల ఊపడమే తప్ప, పాలనాపరమైన కీలక నిర్ణయాల్లో చురుగ్గా జోక్యం చేసుకోలేదన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. చివరకు అదే ఉదాసీనత, అవినీతి ఆరోపణలు ఆయన పదవికి ఎసరు పెట్టాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!