

తాప్సీ పన్ను తన ప్రేమ, వైవాహిక జీవితం గురించి తాజాగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఏడాదే మాజీ డెన్మార్క్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోతో డేటింగ్ మొదలైందని తెలిపారు. మథియాస్‌ను జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం తన జీవితంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాల్లో ఒకటని చెప్పారు. తమ 13 ఏళ్ల బంధానికి పరస్పర గౌరవం, భద్రతే ప్రధాన కారణాలని, ప్రేమ కంటే ముందుగా ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలని తాప్సీ పేర్కొన్నారు. వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచే ఆమె 2024లో సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.
ఇక తన కెరీర్ గురించి కూడా తాప్సీ మాట్లాడారు. ‘గాంధారి’ నెట్‌ఫ్లిక్స్‌లో మంచి ఆదరణ పొందుతున్న సమయంలో ఆమెకు ‘హార్పర్స్ బజార్ ఇండియా ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2026’ పురస్కారం లభించింది. ‘గాంధారి’ తొలి మూడు వారాల్లో 18.9 మిలియన్ల వ్యూస్ సాధించినట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. తన సినీ ప్రయాణంలో తోటి నటీమణులు తనను మరింత మెరుగ్గా నటించేందుకు ప్రేరేపించారని తాప్సీ తెలిపారు. సినీ పరిశ్రమలో మంచి అవకాశాలు, పాత్రల కోసం పోరాడుతున్న ప్రతి మహిళకు ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు చెప్పారు. తన ప్రయాణానికి అండగా నిలిచిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!