

ఎంతో ఆదరణ పొందిన బడ్డీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘ENE రిపీట్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేశ్ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. తొలి రోజే ఈ చిత్రం రూ.15.27 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. రెండో రోజు మరో రూ.7.85 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. దీంతో రెండు రోజుల్లో మొత్తం రూ.23.12 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. యూత్‌ను ఆకట్టుకుంటున్న ఈ ఎంటర్‌టైనర్‌కు ఈ రోజు, రేపు మరింత ఆదరణ లభించి వసూళ్లు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా నైజాం, ఓవర్సీస్ మార్కెట్లలో ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శివాత్మిక రాజశేఖర్, అనిషా అంబ్రోస్ కథానాయికలుగా నటించారు. ఒరిజినల్ చిత్రంలోని ప్రధాన నటీనటులు మరోసారి కలిసి సందడి చేయడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా, వివేక్ సాగర్ సంగీతం అందించారు. తొలి రెండు రోజుల్లో వచ్చిన వసూళ్లతో సినిమా బాక్సాఫీస్ ప్రయాణంపై అంచనాలు మరింత పెరిగాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!