

రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’పై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న త్రిప్తి దిమ్రి తాజాగా సినిమా గురించి స్పందిస్తూ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ప్రస్తుతం పూర్తి వివరాలు వెల్లడించలేనప్పటికీ, ఈ ప్రాజెక్ట్ తన కెరీర్‌లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటుందని ఆమె తెలిపింది. కథ, పాత్రలు, ప్రెజెంటేషన్ అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని, థియేటర్లలో కొత్త అనుభూతి ఎదురవుతుందని పేర్కొంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌లో ప్రభాస్‌తో కలిసి ఆమె కనిపించిన తీరు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో, ఈ జంట మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి మరింత పెరిగింది.
ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీత బాధ్యతలను హర్షవర్ధన్ రామేశ్వర్ నిర్వహిస్తున్నారు. మరోవైపు త్రిప్తి వ్యక్తిగతంగా కూడా ఓ అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది. ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్ ‘విక్టోరియాస్ సీక్రెట్’కు భారతదేశం నుంచి తొలి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక కావడం తనకు ఎంతో గర్వకారణమని ఆమె తెలిపింది. చిన్నప్పటి నుంచి టెలివిజన్‌లో చూసిన బ్రాండ్‌కు ఇప్పుడు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం జీవితంలో మరచిపోలేని ఘట్టమని పేర్కొంది. ఒకేసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంతో పాటు భారీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తుండటం త్రిప్తి కెరీర్‌కు మరింత బలం చేకూర్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!