

దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’పై దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా కథ అంతర్జాతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని మారుస్తున్నారా అనే ప్రశ్నకు తాజాగా ఆయన స్పష్టమైన సమాధానం ఇచ్చాడు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన రాజమౌళి, తన కథల బలం భారతీయ సంస్కృతి, స్థానిక భావోద్వేగాల్లోనే ఉంటుందని చెప్పాడు. వాటిని వదిలి గ్లోబల్ మార్కెట్ కోసం ప్రత్యేకంగా మార్పులు చేయాల్సిన అవసరం తనకు కనిపించడం లేదని వివరించాడు. ఇప్పటి వరకు తన ప్రయాణంలో విజయాన్ని అందించిన అంశాలనే నమ్ముకుని ముందుకు సాగుతున్నానని, అదే విధానాన్ని ఈ చిత్రంలోనూ కొనసాగిస్తున్నానని వెల్లడించాడు.
ప్రేక్షకుల హృదయాలను తాకేది భాష కాదని, కథలోని నిజాయితీ, భావోద్వేగమేనని రాజమౌళి అభిప్రాయపడ్డాడు. స్థానికతను ఎంత సహజంగా చూపిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు కూడా అంతే సులభంగా ఆ కథతో అనుసంధానం అవుతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ చిత్రం ప్రస్తుతం వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌ను ప్రపంచ స్థాయిలో విడుదల చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా, ఏప్రిల్ 7, 2027న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో చిత్రబృందం పనులను వేగవంతం చేసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!