

పౌరాణిక అంశాలను ఆధునిక విజువల్ టెక్నాలజీతో మేళవిస్తూ రూపొందిన ‘నాగబంధం’పై విడుదలకు ముందే అంచనాలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. అభిషేక్ నామా దర్శకత్వంలో దాదాపు రూ.110 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ భారీ అడ్వెంచర్ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుండగా, విదేశాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఒక రోజు ముందుగానే ప్రత్యేక ప్రీమియర్ ప్రదర్శనలకు ఏర్పాట్లు చేశారు. ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్రబృందం సినిమా స్థాయిపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసింది. ప్రధాన పాత్ర పోషించిన విరాట్ కర్ణ మాట్లాడుతూ ఈ కథ కోసం ఎంతో కష్టపడ్డానని, శివుడి ఆశీస్సులతో పాటు దర్శకుడి విజన్‌పై నమ్మకంతో తన శక్తి మేరకు నటించానని చెప్పాడు. ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా ఉంటుందని ఆయన వెల్లడించాడు.
ఇక దర్శకుడు అభిషేక్ నామా మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, పురాణ వైభవాన్ని అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేసే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందించామని వివరించాడు. నిర్మాత కిషోర్ అన్నపురెడ్డి కూడా సినిమా తుది వెర్షన్ చూసిన తర్వాత తనకు కలిగిన అనుభూతిని పంచుకుంటూ, కథనం నుంచి గ్రాఫిక్స్ వరకు ప్రతి అంశం ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేస్తుందని అన్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని, ఆ సన్నివేశం తర్వాత ప్రేక్షకుల్లో ఉత్సాహం మరింత పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రచార చిత్రాలు మంచి స్పందన దక్కించుకోవడంతో, విడుదల తర్వాత ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో అన్న ఆసక్తి సినీ అభిమానుల్లో నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!