

సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ‘రోమాంచకం’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొంది. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. సెప్టెంబర్ 2 నుంచే ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు.
హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్: ‘రోమాంచకం’ ప్రీ-రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన విజయ్ దేవరకొండకు అనంతిక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాలో భాగం కావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. నిర్మాతలు సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డి వంగా, దర్శకుడు వేణుగోపాల్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. చిత్రబృందంతో ఎంతో సరదాగా, సంతోషంగా పనిచేశానని, ప్రతి రోజూ ‘రోమాంచకం’ ఫీల్ తమలో ఉండేదని చెప్పారు. డీవోపీ పవన్, సంగీత దర్శకుడు వాసుకి అద్భుతమైన ఔట్పుట్ ఇచ్చారని ప్రశంసించారు. సెప్టెంబర్ 3న విడుదల కానున్న ఈ సినిమాను స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని ప్రేక్షకులను కోరారు.
దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి: ‘కబీర్ సింగ్’ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో తన ప్రయాణం ప్రారంభమైందని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. తాను కథ చెప్పిన కొద్ది నిమిషాల్లోనే సందీప్ అది ఎలా ఉండబోతుందో అర్థం చేసుకుంటారని చెప్పారు. సందీప్, ప్రణయ్ రెడ్డి వంగాలకు మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉండటంతో ఈ కథ వారికి నచ్చుతుందనే నమ్మకంతో వెళ్లి చెప్పానన్నారు. తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, ‘నీ సినిమా.. నీ విజన్.. జస్ట్ డూ ఇట్’ అని సందీప్ చెప్పారని వెల్లడించారు. కాలేజీలో ఉన్నప్పుడు యువతలో ఉండే ఆత్మవిశ్వాసం, బయట ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఎదురయ్యే వాస్తవ పరిస్థితుల మధ్య ఉండే వ్యత్యాసాన్ని తన కథలో చూపించానని తెలిపారు. సందీప్ తన కథ, పాత్రలు, తన విజన్‌పై పూర్తిగా నమ్మకం ఉంచారని చెప్పారు. ‘మెమ్ ఫేమస్’లోని ఓ చిన్న సన్నివేశం చూసి సుమంత్ ప్రభాస్‌ను ఎంపిక చేసుకున్నానని, అతనిలో ఎంతో ప్రతిభ ఉందని, సినిమాలో అద్భుతంగా నటించాడని ప్రశంసించారు. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత విజయ్ దేవరకొండను ఫిలింమేకర్స్ ఎలా చూశారో.. ఈ సినిమా తర్వాత సుమంత్ ప్రభాస్‌ను కూడా అలాగే చూస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతికను మోస్ట్ టాలెంటెడ్, మోస్ట్ బ్యూటిఫుల్ అని కొనియాడారు. ఎక్కువ మంది కొత్త టెక్నీషియన్లతో పనిచేసి తన విజన్‌పై నమ్మకం ఉంచానని, ఈ సినిమా కొత్త అనుభూతిని, కొత్త తరహా పెర్ఫార్మెన్స్లను అందిస్తుందని చెప్పారు.
హీరో సుమంత్ ప్రభాస్: ‘అర్జున్ రెడ్డి’ ద్వారా విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా ప్రేక్షకులకు ఇచ్చిన ఫీవర్ మామూలుది కాదని సుమంత్ ప్రభాస్ అన్నారు. ఆ సినిమా తమపై ఎంతో ప్రభావం చూపిందని చెప్పారు. విజయ్ దేవరకొండ ‘పెళ్లిచూపులు’ సినిమా చూసిన తర్వాత తమలాంటి వాళ్లు కూడా సినిమాల్లో ప్రయత్నించవచ్చనే నమ్మకం కలిగిందన్నారు. ‘మెమ్ ఫేమస్’ సినిమాకు విజయ్ ప్రచారం చేసి ఇచ్చిన బూస్ట్ ఇప్పటికీ తమలో ఉత్సాహాన్ని నింపుతోందని గుర్తుచేశారు. సందీప్ అన్న సినిమా కథ చెప్పినప్పటి నుంచి, భద్రకాళి కార్యాలయంలో అడుగుపెట్టినప్పటి నుంచి తన జీవితంలో ప్రతిరోజూ ‘రోమాంచకం’గానే అనిపించిందన్నారు. సందీప్, విజయ్‌లతో అనుబంధం ఉన్న బ్యానర్లో సినిమా చేయడం వల్ల తాను కూడా పెద్ద హీరో కావాలనే కల కలిగిందని, ఆ దిశగా ‘రోమాంచకం’ మెట్టుగా నిలవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సినిమాలోని పాత్రలు, వాటిలోని ఫన్, స్వీట్నెస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని, రెండున్నర గంటల పాటు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందుతుందని తెలిపారు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని కోరారు.
నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా: సుమంత్ ప్రభాస్ నిజ జీవితంలో ఎలా సరదాగా ఉంటాడో.. సినిమాలోని పాత్ర కూడా దాదాపు అలాగే ఉంటుందని ప్రణయ్ రెడ్డి వంగా తెలిపారు. సుమంత్ వ్యక్తిత్వంలోని సుమారు 70 శాతం అంశాలు సినిమాలోని పాత్రకు సరిపోతాయని చెప్పారు. అనంతిక ఎంతో ప్రతిభావంతమైన కథానాయిక అని, సినిమాలో అద్భుతంగా నటించిందని ప్రశంసించారు. సుమంత్ స్నేహితులుగా నటించిన నరేంద్ర, రవి, వెంకటేష్, మణి నిజ జీవిత స్నేహితుల బృందంలా కనిపిస్తారని అన్నారు. నరేంద్ర, రవికి ఈ సినిమా మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తవారైనా టెక్నీషియన్లు అందరూ వేణుగోపాల్ విజన్‌ను నమ్మి ఎంతో ప్యాషన్‌తో పనిచేశారని చెప్పారు. వాసుకి అద్భుతమైన సంగీతం అందించారని, పవన్ డీవోపీగా అమేజింగ్ వర్క్ చేశారని ప్రశంసించారు. వేణుగోపాల్ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ డైరెక్టర్ అని, చెప్పిన బడ్జెట్లోనే సినిమాను పూర్తి చేశారని తెలిపారు. ఈ సినిమా వేణుతో పాటు టీమ్‌లోని పలువురికి మంచి అవకాశాలు తెస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. ‘రోమాంచకం’ బాగా వచ్చిందని, కుటుంబ సభ్యులతో కలిసి చూసే క్లీన్ మూవీ అని పేర్కొన్నారు. పాటలు విడుదలైన ప్రతిసారీ వాటిని షేర్ చేసి మద్దతు ఇచ్చిన ప్రభాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మెహర్ రమేశ్‌తో తమకు ఉన్న ప్రత్యేక కనెక్షన్ ఏమిటో సెప్టెంబర్ 3న సినిమా చూసినప్పుడు ప్రేక్షకులకు అర్థమవుతుందని అన్నారు.
నిర్మాత సందీప్ రెడ్డి వంగా: దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి కథ చెప్పినప్పుడు తాను బాగా నవ్వుకున్నానని సందీప్ రెడ్డి వంగా తెలిపారు. అయితే కథను చెప్పినంత బాగా సినిమాగా తెరకెక్కించగలడా అని సందేహం వ్యక్తం చేశానన్నారు. ఆ తర్వాత వేణుగోపాల్ ఆరు నిమిషాల నిడివి గల ఓ సన్నివేశాన్ని చిత్రీకరించి తీసుకురాగా.. స్క్రిప్ట్‌లో ఉన్నదానికంటే మరింత అద్భుతంగా తెరకెక్కించాడని అనిపించిందన్నారు. అప్పటి నుంచి సినిమా బాధ్యత మొత్తాన్ని వేణుకే అప్పగించానని, తాను ఎక్కడా జోక్యం చేసుకోలేదని చెప్పారు. మెయిన్ లీడ్ అయినప్పటికీ సుమంత్ ప్రభాస్‌లో హీరో అనే ఫీల్ కనిపించకుండా స్నేహితుల పాత్రలతో కలిసి సహజంగా నటించాడని, అతని అమాయకమైన పాత్రలో అద్భుతంగా నటించాడని ప్రశంసించారు. అనంతిక, ఇతర స్నేహితుల పాత్రల్లో నటించిన వారంతా బాగా చేశారని చెప్పారు. సంగీతం కోసం వాసుకిని నమ్మకంతో ఎంపిక చేశామని, పాటలు, మ్యూజిక్ విన్న తర్వాత ఆ నిర్ణయం సరైందని అనిపించిందన్నారు. సెప్టెంబర్ 3న సినిమా విడుదలవుతుందని, సెప్టెంబర్ 2 నుంచే ప్రీమియర్స్ ఉంటాయని వెల్లడించారు. సెప్టెంబర్ 3 వేణుగోపాల్ కల నిజమయ్యే రోజని, అది ఆయన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజుగా మిగలాలని ఆకాంక్షించారు. తనకు, విజయ్‌కు ‘అర్జున్ రెడ్డి’ విడుదలైన ఆగస్టు 24 ఎప్పటికీ గుర్తుండిపోతుందని, అలాంటి రోజే వేణుకూ రావాలని కోరుకున్నారు. సినిమా కోసం టీమ్ మొత్తం ఎంతో కష్టపడిందని, ప్రేక్షకులు ఖర్చు చేసే డబ్బు, సమయం ఏమాత్రం వృథా కావని చెప్పారు. మళ్లీ సినిమా చూడాలనిపించేలా ఫన్ సీన్స్ కూడా ఉన్నాయని తెలిపారు.
స్టార్ హీరో విజయ్ దేవరకొండ: సందీప్ రెడ్డి వంగాపై తనకున్న ప్రేమను మాటల్లో చెప్పలేనని విజయ్ దేవరకొండ అన్నారు. తమ బంధం దర్శకుడు-హీరో, అన్నదమ్ములు లేదా స్నేహితుల మధ్య ఉండే సంబంధం కంటే ఎంతో గొప్పదని చెప్పారు. ‘అర్జున్ రెడ్డి’ సమయంలో తామిద్దరం భారీ రిస్క్ తీసుకున్నామని, అప్పట్లో తమ వద్ద డబ్బు, పేరు, ఇన్ఫ్లుయెన్స్ ఏమీ లేవని గుర్తుచేశారు. అప్పటికి ‘పెళ్లిచూపులు’ కూడా విడుదల కాలేదని, అభిమానుల అండ కూడా పెద్దగా లేదని చెప్పారు. అయినా ధైర్యంగా ముందడుగు వేశామని అన్నారు. తనపై నమ్మకంతో సందీప్ కుటుంబం భారీ ఆర్థిక రిస్క్ తీసుకుని ‘అర్జున్ రెడ్డి’ సినిమా చేసిందని గుర్తుచేసుకున్నారు. సందీప్ కోసం తాను ఎంతదూరమైనా వెళ్తానని, తన కోసం సందీప్ కూడా అంతే చేస్తాడని చెప్పారు. సుమంత్ ప్రభాస్‌ను చూసినప్పుడు అతని కళ్లలో సినిమాపై ఓ డ్రీమ్ కనిపించిందని, ఏదో ఒకరోజు అతను నటుడిగా లేదా దర్శకుడిగా ఎదుగుతాడని అప్పుడే అనుకున్నానని తెలిపారు. ‘మెమ్ ఫేమస్’కు తన వంతుగా ప్రచారం చేసి సపోర్ట్ చేశానని గుర్తుచేశారు. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సందీప్, ప్రణయ్ సినిమా చేస్తున్నారంటే తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. సుమంత్, అనంతిక, వేణుగోపాల్, కొత్త టెక్నీషియన్లందరికీ సినిమా పెద్ద విజయాన్ని అందించాలని ఆకాంక్షించారు. వాసుకి స్వరపరిచిన ‘రాధారమణ’ పాట ఆనంద్‌కు ఎంతో ఇష్టమని, అతను రోజూ వింటుంటాడని చెప్పారు. సెప్టెంబర్ 2 ప్రీమియర్స్ నుంచే సినిమా ఘన విజయం సాధించాలని కోరుకున్నారు. సినిమా కోసం పనిచేసేటప్పుడు ఎంత ఎంజాయ్ చేశామనేది కూడా ముఖ్యమని, విజయం ఇవాళ కాకపోతే రేపైనా వస్తుందని అన్నారు. మనపై మనకు నమ్మకం, విజయం సాధించాలనే తపన ఉంటే తప్పకుండా సక్సెస్ దక్కుతుందని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!