

సినిమాలతో పాటు సంగీత రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి, గాయని శ్రుతి హాసన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాజాగా ఆమె కీలక పాత్రలో నటించిన ‘ఆకాశంలో ఒక తార’ విడుదల సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తనకు ఎవరి నుంచీ గుర్తింపు ఆశించే అలవాటు లేదని, ముఖ్యంగా తండ్రి కమల్ హాసన్ నుంచి అలాంటి ప్రశంసలను ఆశించనని తెలిపారు. తన తండ్రి కూడా సాధారణ తండ్రుల్లాగే ఉంటారని, 99 మార్కులు వచ్చినా మిగిలిన ఒక్క మార్కు గురించి అడిగేవారని చెప్పారు. 19 ఏళ్ల వయసులో అమెరికాలో సంగీత విద్యను అభ్యసించేందుకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనప్పుడు తండ్రి చివరిసారిగా తన చదువుల కోసం ఖర్చు చేశారని గుర్తుచేసుకున్నారు. ఎంతకాలమైనా చదువుకోవాలంటే ఫీజు చెల్లిస్తానని, అయితే తన జీవితానికి సంబంధించిన బాధ్యతలను తానే తీసుకోవాలని తండ్రి చెప్పినట్లు వెల్లడించారు. అప్పటి నుంచి తన జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోలేదని పేర్కొన్నారు.
ఇదే ఇంటర్వ్యూలో ముంబయిలోని తన ఇంట్లో ఎదురైన ఓ వింత అనుభవాన్ని కూడా శ్రుతి హాసన్ వెల్లడించారు. తన వద్ద ఫియోనా అని పిలుచుకునే మనిషి ఆకారంలోని ఓ బొమ్మ ఉండేదని, దానికి తన దుస్తులు కూడా వేసేవారని తెలిపారు. ఇంటికి వచ్చే స్నేహితులు ఆ బొమ్మను పలకరించేవారని, కొంతకాలం తర్వాత ఆ బొమ్మ ఉన్న స్థానం మారడాన్ని గమనించానని చెప్పారు. దానిని ఎవరు కదిలించారని ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చిందని, ఆ ఘటన తనకు వింతగా అనిపించిందని వివరించారు. దీంతో ఆ బొమ్మను ఇంటి నుంచి తొలగించాలని నిర్ణయించుకుని హనుమాన్ చాలీసా చదివి, దానిని విరిచేశానని తెలిపారు. అప్పటి నుంచి తన ఇల్లు ప్రశాంతంగా ఉందని శ్రుతి హాసన్ వెల్లడించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!