

భారతీయ సినీ ఇండస్ట్రీలో గ్యాంగ్‌స్టర్ డ్రామాలు, పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్లతో ప్రత్యేక గుర్తింపు పొందిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన తన కెరీర్లో అత్యంత సక్సెస్ అయిన సర్కార్ మూవీ సిరీస్‌లో నాలుగో భాగమైన సర్కార్ 4ను ప్రకటించారు. ఈ విషయాన్ని రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న సందర్భంగా ముంబైలో వెల్లడించారు. అభిమానులతో మాట్లాడిన వర్మ, వచ్చే నెల నుంచే మూవీ షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. అలాగే ది సిండికేట్ అనే మరో కొత్త ప్రాజెక్ట్‌ను కూడా ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఆ సినిమా తన గత సినిమాల ‘పాపాలన్నింటినీ కడిగేస్తుంది’ అని సరదాగా వ్యాఖ్యానించారు.
2005లో విడుదలైన సర్కార్ మూవీ భారతీయ సినిమా చరిత్రలో ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇందులో అమితాబ్ బచ్చన్ పోషించిన సుభాష్ నాగ్రే పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాగే అభిషేక్ బచ్చన్ కూడా కీలక పాత్రలో నటించారు. తర్వాత వచ్చిన సర్కార్ రాజ్ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఇందులో ఐశ్వర్య రాయ్ బచ్చన్ నటించడం వల్ల సిరీస్‌కు మరింత ఆకర్షణ వచ్చింది. దాదాపు పదేళ్ల తర్వాత వచ్చిన సర్కార్ 3లో యామీ గౌతమ్, మనోజ్ బాజ్‌పేయి కీలక పాత్రల్లో కనిపించారు. రాబోయే నాలుగో భాగంలో అమితాబ్ బచ్చన్ మళ్లీ నటిస్తారా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఇదే సమయంలో డైరెక్టర్ ఆదిత్య ధర్ పనితీరుపై కూడా వర్మ ప్రశంసలు కురిపించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!