

టాలీవుడ్ హీరో రామ్ పోతినేని తన అభిమాని పట్ల గొప్ప మనసు చాటుకున్నారు. అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న 18 ఏళ్ల శశిభవ్యతకు అండగా నిలిచారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడికి చెందిన శశిభవ్యత ‘లఫోరా మయోక్లోనిక్ ఎపిలెప్సీ’తో బాధపడుతూ మంచానికే పరిమితమైంది. రామ్ అంటే ఎంతో అభిమానం ఉన్న ఆమెకు ఆహారం, మందులు అందించేటప్పుడు తల్లిదండ్రులు ఆయన సినిమాలు, వీడియోలు చూపిస్తుంటారు. ఈ విషయం మీడియా, సోషల్ మీడియా ద్వారా రామ్ దృష్టికి వెళ్లింది.
దీనిపై వెంటనే స్పందించిన రామ్.. శశిభవ్యతతో వీడియో కాల్‌లో మాట్లాడి ఆమెకు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆమె వైద్య నివేదికలు తనకు అందాయని, ఇకపై మందులు, ఇతర వైద్య అవసరాలకు అయ్యే ఖర్చులన్నీ తానే భరిస్తానని హామీ ఇచ్చారు. శశిభవ్యతను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచాలని, మందులను సమయానికి అందించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చిన మీడియా ప్రతినిధులు, అభిమానులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు రామ్ కృతజ్ఞతలు తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!