

ఈ నెల 5 న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన బాలకృష్ణ నటించిన ‘అఖండ 2: తాండవం’ అనుకోని పరిస్థితుల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ విషయం పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఆదివారం సోషల్ మీడియాలో స్పందించారు. విడుదల నిలిచిపోవడం తనను ఎంతో కలిచివేసిందని తెలిపారు.
అతను పేర్కొన్నదేమిటంటే, ఇటువంటి చివరి నిమిష అడ్డంకులు ఒక సినిమా బృందానికే కాకుండా బయ్యర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు, టెక్నీషియన్స్ వంటి పలువురి జీవనోపాధి పై ప్రభావం చూపుతాయని అన్నారు. ముఖ్యంగా పెద్ద సినిమాల పోటీని దాటి, సరైన సమయం చూసుకుని విడుదలకు సిద్ధమయ్యే చిన్న సినిమాలు ఇలాంటి అవాంతరాల వల్ల మరింత వేచి చూడాల్సి రావడం విచారకరమని తెలిపారు. థర్డ్ పార్టీ జోక్యంతో విడుదలలకు ఆటంకాలు రాకుండా స్పష్టమైన చట్టపరమైన నిబంధనలు వెంటనే అమల్లోకి రావాలని సూచించారు.
అలాగే ‘ది రాజాసాబ్’ విడుదల పై వస్తున్న ఊహాగానాలను కూడా ఆయన ఖండించారు. చిత్రానికి సంబంధించిన బాహ్య పెట్టుబడులన్నీ ఇప్పటికే తమ స్వంత నిధులతో చెల్లించామని, మిగిలిన వడ్డీ కూడా త్వరలో పూర్తవుతుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా డిసెంబర్లో రిలీజ్‌కు సిద్ధమైన చిత్రాలు, అలాగే 2026 సంక్రాంతికి వచ్చే ‘ది రాజాసాబ్’, ‘మన శంకరవరప్రసాద్‌గారు’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ‘అనగనగా ఒక రాజు’, ‘నారీ నారీ నడుమ మురారి’, ‘జన నాయగన్’, ‘పరాశక్తి’ వంటి అన్ని సినిమాలు విజయం సాధించాలని ఆకాంక్షించారు. సినిమా కేవలం వ్యాపారం మాత్రమే కాక, ఒక సంస్కృతి, భావోద్వేగ ప్రయాణమని, దాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని విశ్వప్రసాద్ పేర్కొన్నారు.
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ది రాజాసాబ్’ జనవరి 9 న విడుదల కానుందని టీమ్ ఇప్పటికే ప్రకటించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!