

‘పుష్ప: ది రైజ్’, ‘పుష్ప: ది రూల్’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాలు అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’తో పాటు, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో భారీ యాక్షన్ డ్రామాకు సిద్ధమవుతున్నారు. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్‌పై చోటు దక్కించుకున్న అల్లు అర్జున్, ప్రత్యేక ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘పుష్ప’లో జాతర సన్నివేశంలో మహిళా వేషధారణలో చీరకట్టుకుని, ఒంటికి రంగులు పూసుకుని నటించడం తన జీవితంలో చేసిన అత్యంత సాహసోపేతమైన పనుల్లో ఒకటని చెప్పారు.
నిజమైన స్టార్‌డమ్ అంటే ప్రశంసలతో పాటు విమర్శలను కూడా ధైర్యంగా స్వీకరించడమేనని అల్లు అర్జున్ అన్నారు. సినిమా పరిశ్రమలో ఒత్తిడిని భయంగా కాకుండా అరుదుగా లభించే ఒక గొప్ప అవకాశం, అదృష్టంగా భావిస్తానని తెలిపారు. బాక్సాఫీస్ విజయాలపై మాట్లాడుతూ, నేటి ప్రేక్షకులు ఎంతో తెలివైనవారని, సాధారణ కంటెంట్‌ను వారు ఆదరించడం లేదని పేర్కొన్నారు. నిజాయితీగా రూపొందించిన గొప్ప సినిమాకు ప్రేక్షకుల ఆదరణతో పాటు భారీ కలెక్షన్లు, బాక్సాఫీస్ రికార్డులు సహజంగానే వస్తాయని అన్నారు. ‘పుష్ప’ విజయం భారతీయ సినిమాను ప్రపంచ వేదికపై మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో తనను నిరంతరం ప్రేరేపిస్తోందని చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!