

‘మనం ఎదుగుతుంటే పక్కవారు చూడలేరు’ అంటూ ఓ ఇన్‌ఫ్లూయెన్సర్ చేసిన పోస్ట్‌కు నటి శోభితా ధూళిపాళ్ల మద్దతు తెలిపారు. తెలుగు వాళ్లను ఉద్దేశిస్తూ ‘మనకు మనమే శత్రువులం’ అంటూ షేర్ చేసిన వీడియోకు ఆమె ‘100 శాతం కరెక్ట్’ అంటూ ఎమోజీతో రిప్లై ఇచ్చారు. ఈ సందర్భంగా తాను ఇండస్ట్రీలోకి రావాలని నిర్ణయించుకున్న రోజుల్లో ఎదురైన అనుభవాలను శోభిత పంచుకున్నారు. 16 ఏళ్ల వయసులోనే బ్యాగులు సర్దుకుని ముంబయికి వెళ్లానని, ఈ రంగంలో తప్పకుండా రాణిస్తాననే నమ్మకం లేకపోయినా ధైర్యంగా అడుగు ముందుకు వేశానని తెలిపారు.
కొత్తగా ఏదైనా రంగంలోకి అడుగుపెట్టేవారిని సమాజం ప్రోత్సహించకపోవడం తరచూ కనిపిస్తుందని శోభిత అన్నారు. ముఖ్యంగా మహిళలు కొత్త రంగాల్లోకి వస్తే సవాళ్లు మరింత పెరుగుతాయని పేర్కొన్నారు. అయితే ఇవన్నీ గతంలో ఎదురైన పరిస్థితులని, ప్రస్తుతం పరిస్థితులు మారాయని ఆశిస్తున్నానని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగాలని, ఇతరులపై ఆధారపడకుండా తమ కోసం తాము నిలబడే మానసిక బలాన్ని పెంచుకోవాలని సూచించారు. 2016లో హిందీ చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన శోభిత.. ‘గూఢచారి’, ‘మేజర్’, ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!