

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డ్రగ్ కంట్రోల్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రంలోని 100 మందుల దుకాణాల్లో తనిఖీలు చేపట్టగా, 55 దుకాణాల్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఈ తనిఖీల్లో భారీగా ట్రామాడోల్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకుని, ఐదుగురిని అరెస్ట్ చేశారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో ట్రామాడోల్ ఇంజెక్షన్లను పెద్దమొత్తంలో వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఏడాది శ్రీలక్ష్మీ శ్రీనివాస మెడికల్ ఏజెన్సీ 20 వేల ట్రామాడోల్ ఇంజెక్షన్లు కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. గుట్టుచప్పుడు కాకుండా నిల్వ చేసిన 7,550 ట్రామాడెక్స్ ఇంజెక్షన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని జంగారెడ్డిగూడెం, మేడ్యానపు వరిగూడెం, వేగవరం, కుక్కునూరు తదితర ప్రాంతాల్లోని మందుల దుకాణాలు, వ్యక్తులకు సరఫరా చేసినట్లు గుర్తించారు.
మరోవైపు డి.రూపా పెడ్డింటి మెడికల్ ఏజెన్సీ నకిలీ బిల్లులతో 5,200 ట్రామెక్ ఇంజెక్షన్లు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. అందులో 3,930 ఇంజెక్షన్లను తెలంగాణలోని ఓ మందుల దుకాణానికి విక్రయించినట్లు బిల్లుల్లో చూపించినప్పటికీ, ఆ లావాదేవీలన్నీ నకిలీవని తెలంగాణ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు తదుపరి చర్యలు చేపట్టారు. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డాయని గుర్తించిన శ్రీలక్ష్మీ శ్రీనివాస మెడికల్ ఏజెన్సీ, డి.రూపా పెడ్డింటి మెడికల్ ఏజెన్సీల లైసెన్సులను రద్దు చేసేందుకు చర్యలు ప్రారంభించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!