

నీమ్ కరోలి బాబా జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయాన్ని అందుకుంటోంది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం 40 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.291.40 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శోబినవ్ సత్యా ప్రధాన పాత్రలో నటించారు. విశ్వాసం, ప్రేమ, సేవ, భక్తి వంటి అంశాలను కథలో ప్రధానంగా చూపించారు. ఈ సినిమా నిర్మాణంలో రాగిణి సోనా, నమ్రతా జీ. సింగ్, 21 ఏళ్ల అనుప్రియా నగర్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఒక్కొక్కరు సుమారు రూ.60 లక్షల చొప్పున పెట్టుబడి పెట్టినట్లు అనుప్రియా తెలిపారు. షూటింగ్ పూర్తయిన తర్వాత నిర్మాణానంతర కార్యక్రమాల సమయంలో తాను ప్రాజెక్టులోకి వచ్చినట్లు ఆమె వివరించారు.
అనుప్రియా ఆర్థికంగా అండగా నిలిచారని దర్శకుడు విశాల్ చతుర్వేది తెలిపారు. అయితే ఆమె కథ రాశారని, సినిమాను రూపొందించడంలో కీలకంగా వ్యవహరించారనే ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. మరోవైపు సినిమాకు ఊహించని ఆదరణ లభించడంతో మూడు ఓటీటీ సంస్థలు హక్కుల కోసం సంప్రదిస్తున్నట్లు నిర్మాత రాగిణి సోనా వెల్లడించారు. మొదటి నుంచీ సినిమాను ఓటీటీ కోసం కాకుండా థియేటర్ల కోసమే రూపొందించామని ఆమె చెప్పారు. తొలుత 26 రోజుల షూటింగ్‌కు ప్రణాళిక వేసుకున్నప్పటికీ ఖర్చు పెరగకుండా 22 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేసినట్లు దర్శకుడు తెలిపారు. ‘హనుమాన్ అంశ్’ తెలుగు విడుదల వాయిదా పడగా, త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!