

యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధించాలన్న పార్లమెంటరీ స్థాయీసంఘం సిఫార్సులకు కాంగ్రెస్ ఎంపీలు అసమ్మతి వ్యక్తం చేయలేదంటూ వచ్చిన వార్తలను ఎంపీ గౌరవ్ గొగొయ్ ఖండించారు. ఆగస్టు 12న ఆర్థిక వ్యవహారాల స్థాయీసంఘం నివేదికను ఆమోదించిన సమయంలో గౌరవ్ గొగొయ్, పి. చిదంబరం, మనీశ్ తివారీ, కిశోరీ లాల్, కె. గోపీనాథ్ సహా ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు హాజరయ్యారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. నివేదికలో యూపీఐ కోసం దశలవారీ ఆదాయ నమూనా, ఎండీఆర్ వ్యవస్థను పరిశీలించాలని సిఫార్సు చేసినట్లు వెల్లడైంది.
అయితే ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన నిర్దిష్ట యూపీఐ ఛార్జీల ప్రతిపాదనపై స్థాయీసంఘంలో చర్చ జరగలేదని గొగొయ్ స్పష్టం చేశారు. ఆ సమావేశం సమయంలో ఆర్థిక శాఖ వద్ద రేటు, ఛార్జీ పరిమితి, మినహాయింపులు వంటి వివరాలతో కూడిన నిర్దిష్ట ప్రతిపాదన లేదని తెలిపారు. ఎండీఆర్ అవసరంపై సభ్యులు ప్రశ్నలు లేవనెత్తినా, ప్రభుత్వ ప్రతినిధుల నుంచి స్పష్టమైన సమాధానాలు రాలేదని పేర్కొన్నారు. కొత్త యూపీఐ ఛార్జీల విధానం చిన్న వ్యాపారులు, విక్రేతలపై ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ వాదిస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!