

హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ రూపొందించిన ‘అవతార్’ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ‘ఫైర్ అండ్ యాష్’ సహా ఇప్పటివరకు వచ్చిన మూడు అవతార్ చిత్రాల వెనుక పనిచేసిన కీలక సృజనాత్మక శక్తుల్లో ఒకరు పావని రావు. ఈ సినిమాల విజువల్ ఎఫెక్ట్స్‌ను వెటా ఎఫ్ఎక్స్ సంస్థ తరఫున ఆమె దగ్గరుండి పర్యవేక్షించారు.
ఢిల్లీ లో జన్మించి పెరిగిన పావని రావు, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నుంచి బీఆర్క్ పట్టా పొందారు. అనంతరం శాన్ఫ్రాన్సిస్కోలోని అకాడమీ ఆఫ్ ఆర్ట్ యూనివర్సిటీలో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్‌లో ఎంఎఫ్ఏ పూర్తి చేశారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో నివసిస్తున్న ఆమె, జేమ్స్ కామెరూన్‌తో దీర్ఘకాలంగా కలిసి పనిచేస్తున్నారు.
2009 లో విడుదలైన తొలి ‘అవతార్’ సినిమాతో ఈ ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత వచ్చిన అన్ని అవతార్ భాగాల్లోనూ విజువల్ వండర్స్‌కు ఆమె కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ‘ది వే ఆఫ్ వాటర్’ చిత్రంలో సుమారు 3,000 విజువల్ ఎఫెక్ట్స్ షాట్లు రూపొందించగా, వాటిలో చాలా నీటి అడుగున చిత్రీకరించినవే కావడం విశేషం.
తన ప్రయాణం గురించి పావని మాట్లాడుతూ,
నా నానమ్మ ఉన్నితో బొమ్మలు తయారు చేసేది. చిన్నప్పటినుంచి వాటిని చూస్తూ ఆర్కిటెక్ట్ అవ్వాలని కలగన్నాను. తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ ప్రపంచం నన్ను ఆకర్షించింది. డిజిటల్ కోర్సులు చేసినప్పటికీ నిజమైన అవగాహన మాత్రం ‘అవతార్’ పై పనిచేసినప్పుడే వచ్చింది. ప్రతి షాట్ ఒక అద్భుతం. ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని చూపాలంటే ముందుగా మనమే దాన్ని ఆస్వాదించాలి అని చెప్పారు.
ఆమె మొదట అవతార్-1 లో లైటింగ్ టీడీగా పని చేయడానికి ఎంపికయ్యారు. కొన్ని సన్నివేశాలకు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ ఆలోచనలను జేమ్స్ కామెరూన్ కు వివరించడం ద్వారా, అవతార్ మూడు భాగాల్లో పనిచేసే అవకాశం లభించిందని తెలిపారు. ఆయనతో కలిసి పని చేయడం తన కెరీర్లో గొప్ప అనుభూతిగా పేర్కొన్నారు.
‘అవతార్’ సిరీస్‌తో పాటు ‘ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా’, ‘నైట్ ఎట్ ద మ్యూజియం’, ‘ది ఇన్క్రెడిబుల్ హల్క్’, ‘రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ వంటి ప్రముఖ చిత్రాలకు కూడా ఆమె పని చేశారు. వెటా ఎఫ్ఎక్స్ సంస్థ తరఫున ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్‌కు గానూ అకాడమీ, బాఫ్టా, ఎమ్మీ తదితర ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకోవడం తమ బృందానికి గర్వకారణమని పావని పేర్కొన్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!