

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘స్వయంభూ’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారతీయ సాంస్కృతిక వారసత్వం, ఓ యోధుడి గాథకు ఆధారంగా రూపొందిస్తున్నారు. తాజాగా నిఖిల్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఒకే సినిమా కోసం 175 రోజులు షూటింగ్ చేయడం, దాదాపు 2,500 గ్రాఫిక్స్ షాట్లు ఉండటం తన కెరీర్‌లో ఇదే తొలిసారి అని ఆయన వెల్లడించారు. సినిమా విడుదలకు దాదాపు సిద్ధమవుతోందని, త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపారు.
ఈ చిత్రంలో సంయుక్త ‘భూమి’ పాత్రలో నటిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాల కోసం ఆమె ప్రత్యేకంగా శ్రమించినట్లు చిత్రబృందం గతంలో వెల్లడించింది. మారేడుమిల్లిలో కింద నది ప్రవహించే ప్రాంతంలో హార్నెస్ సాయంతో తాడుపై వేలాడుతూ పర్వతాన్ని అధిరోహించే సన్నివేశాన్ని ఆమె చిత్రీకరించినట్లు సమాచారం. మరోవైపు నిఖిల్ వియత్నాంలో ప్రత్యేక మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుని, రెండు చేతులతో కత్తి యుద్ధం చేయడంలో ప్రత్యేక నైపుణ్యం సాధించారు. సినిమాలోని పలువురు సహాయ నటీనటులకు కూడా వియత్నాం నిపుణులతో శిక్షణ ఇప్పించారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో దాదాపు 60 రోజుల పాటు భారీ క్లైమాక్స్ సన్నివేశాలను తెరకెక్కించారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ‘స్వయంభూ’ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!