

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న భారీ చిత్రం రాకాకు సంగీతం అందిస్తున్న సాయి అభ్యంకర్ ఇప్పుడు చర్చల్లోకి వచ్చారు. యువ సంగీత దర్శకుడిగా మంచి అవకాశాలు అందుకుంటున్న ఆయన పనితీరుపై తాజాగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ధనుష్ నటించిన ఓం సినిమా విడుదలైన తర్వాత అందులో సాయి అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చినా, నేపథ్య సంగీతంపై మాత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో అవసరానికి మించిన భారీ శబ్దాలు వినిపించాయని, సంగీతం సినిమా కథనానికి ఆటంకంగా మారిందని సోషల్ మీడియాలో పలువురు అభిప్రాయపడుతున్నారు.
అయితే సాయి అభ్యంకర్ ప్రతిభను తక్కువగా చూడలేమని, ఆయనకు మంచి అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. కానీ భారీ యాక్షన్ చిత్రాలకు సంగీతం అందించడం మాత్రం ప్రత్యేకమైన సవాలని విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు రాకా లాంటి భారీ పాన్ ఇండియా సినిమాకు ఆయన సంగీతం అందిస్తుండటంతో అంచనాలు పెరిగాయి. అల్లు అర్జున్ స్థాయికి తగ్గట్టుగా అద్భుతమైన పాటలు, ప్రభావవంతమైన నేపథ్య సంగీతం ఇవ్వాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ఓం సినిమాతో వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని రాకా విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!