

గీత రచయిత చంద్రబోస్ తన తాజా చిత్రం ‘భోగి’ పాటల రచన విశేషాలను వెల్లడించారు. ‘‘స్వరం భావాన్ని అనుసరించాలి కానీ, భావం స్వరాన్ని అనుకరించకూడదు’’ అనే సూత్రాన్ని తాను నమ్ముతానని చెప్పారు. సాధారణంగా తనకు చిరస్థాయిగా గుర్తుండిపోయిన ఎన్నో పాటలకు ముందుగా సాహిత్యం రాసి, ఆ తర్వాతే బాణీలు సమకూర్చారని తెలిపారు. ‘భోగి’ సినిమాలోని ‘ఎగిలి వారంగా..’ పాటను కూడా ఇదే పద్ధతిలో రూపొందించినట్లు వివరించారు. శర్వానంద్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడిన చంద్రబోస్.. సినిమాలోని అన్ని పాటలను 1960ల నాటి సహజమైన తెలంగాణ మాండలికంలో రాయడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు.
సినిమా గీత రచయిత ప్రతి ప్రాంతపు మాండలికంలోనూ ఒదిగిపోవాలని చంద్రబోస్ అభిప్రాయపడ్డారు. ‘రంగస్థలం’ కోసం గోదావరి యాసలో, ‘పుష్ప’ కోసం చిత్తూరు యాసలో పాటలు రాశానని, ‘భోగి’ కోసం తన మాతృ మాండలికమైన తెలంగాణ యాసను ఉపయోగించానని తెలిపారు. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ రావడంపై స్పందిస్తూ.. ఆ పాట కోసం ఏడాదిన్నరకు పైగా సమయం కేటాయించానని, తన సహనానికి దక్కిన గుర్తింపుగా ఆ అవార్డును భావిస్తానని అన్నారు. తన పాటలు సామాన్యులకు సైతం సులభంగా అర్థమయ్యేలా ఉండాలని, ప్రతి పాటలో కథలా సాగే ప్రారంభం, కొనసాగింపు, ముగింపు ఉండాలని కోరుకుంటానని చెప్పారు. ప్రస్తుతం ‘రౌడీ జనార్ధన’, ‘విశ్వంభర’, ‘బరి’తో పాటు షారుక్ ఖాన్, శ్రీవిష్ణు చిత్రాలకూ పాటలు రాస్తున్నట్లు వెల్లడించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!