

తెలుగు చలనచిత్ర సంగీత ప్రపంచాన్ని దాదాపు ఒకటిన్నర దశాబ్దం పాటు తన బాణీలతో శాసించిన సంగీత దర్శకుడు చక్రవర్తి. ఆయన అసలు పేరు కొమ్మినేని అప్పారావు. నటుడు, దర్శకుడు కొమ్మినేని శేషగిరిరావు సోదరుడైన చక్రవర్తి తొలుత గాయకుడిగా సినీ ప్రయాణం ప్రారంభించారు. కన్నడ చిత్రం ‘మాంగళ్య యోగం’లో తొలి పాట పాడిన ఆయన, అనంతరం ‘జయ విజయ’ చిత్రంలోనూ పాటలు పాడారు. గాయకుడిగా కొనసాగడం ఇష్టం లేక దర్శకుడు సి.ఎస్.రావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్టుగా మారి ఎంజీఆర్, శివాజీ గణేశన్, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి అగ్ర నటులకు తెలుగులో డబ్బింగ్ చెప్పారు. సమతా మూవీస్ అధినేత ఛటర్జీ అప్పారావు పేరును ‘చక్రవర్తి’గా మార్చి, 1971లో ‘మూగ ప్రేమ’ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయం చేశారు. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా, నిర్మాత క్రాంతి కుమార్ ‘శారద’ చిత్రంతో మరో అవకాశం ఇచ్చారు. కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘శారద’ మ్యూజికల్ హిట్ కావడంతో చక్రవర్తికి మంచి గుర్తింపు వచ్చింది. అనంతరం ‘ఇదా లోకం’, ‘బాబు’, ‘అన్నదమ్ముల అనుబంధం’ వంటి చిత్రాలకు సంగీతం అందించారు.
1977లో విడుదలైన ఎన్టీఆర్ ‘యమగోల’ చక్రవర్తి కెరీర్‌ను మలుపుతిప్పింది. సినిమాలోని పాటలన్నీ ఘన విజయం సాధించడంతో ఆయన పూర్తి స్థాయి మాస్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగారు. ‘16 ఏళ్ల వయసు’తో క్లాస్, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన ‘డ్రైవర్ రాముడు’, ‘కొండవీటి సింహం’, ‘బలిపీఠం’, ‘జేబు దొంగ’, ‘ప్రేమాభిషేకం’ వంటి చిత్రాలకు చిరస్థాయిగా నిలిచిపోయే బాణీలు అందించారు. నాలుగు తరాల హీరోలకు సంగీత విజయాలను అందించిన చక్రవర్తి.. ఏడాదికి దాదాపు 80 సినిమాలకు పనిచేసిన ఘనత సాధించారు. 1981, 1982 నాటికి అగ్ర సంగీత దర్శకులను అధిగమించి 1988 వరకు నంబర్ వన్ స్థానంలో కొనసాగారు. మొత్తం 959 చిత్రాలకు సంగీతం అందించిన ఆయన 1,000 సినిమాల అరుదైన రికార్డుకు కేవలం 41 చిత్రాల దూరంలో నిలిచారు. పెద్ద కుమారుడు రాజేంద్ర ప్రసాద్ బైక్ ప్రమాదంలో మరణించడంతో తీవ్ర విషాదానికి గురైన చక్రవర్తి 1989 నుంచి సినీ సంగీతానికి దూరమయ్యారు. 2002 ఫిబ్రవరి 3న రెండు కిడ్నీలు విఫలమై కన్నుమూయడంతో తెలుగు సినీ సంగీతంలో ఓ స్వర్ణయుగానికి ముగింపు పలికింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!