

నటి, నిర్మాత సమంత సినిమాలతో పాటు పలు వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెడుతూ ముందుకు సాగుతున్నారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యాపార ప్రయాణం, ట్రోలింగ్ గురించి ఆమె ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అనారోగ్యం కారణంగా ఏడాది పాటు విరామం తీసుకున్న సమయంలో నటనకు పూర్తిగా దూరమై ఇతర వృత్తులపై దృష్టి పెట్టాలని ఒక దశలో భావించినట్లు చెప్పారు. ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని, వీలైతే నటనకు బదులుగా మరో వృత్తిని ఎంచుకోవాలని వైద్యులు సూచించడంతో ఆ విషయాన్ని సీరియస్‌గా ఆలోచించినట్లు తెలిపారు. అనంతరం తనకు నమ్మకం ఉన్న పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టానని, వ్యాపారవేత్తగా మారిన తర్వాత జీవితాన్ని మరింత ఆస్వాదిస్తున్నానని చెప్పారు. అనారోగ్య సమయంలో Citadel షూటింగ్‌లో పాల్గొనడం చాలా కష్టంగా అనిపించిందని, తన కారణంగా చిత్రబృందం సమయం వృథా కాకూడదనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని పలు ఈమెయిల్స్ పంపినట్లు వెల్లడించారు. అయితే చిత్రబృందం తననే కొనసాగించాలని కోరడంతో షూటింగ్‌ను పూర్తి చేశానన్నారు. అలాగే మా ఇంటి బంగారం చిత్రంలో తొలుత నిర్మాతగా తెరవెనుక ఉండాలని భావించినప్పటికీ, రాజ్ ప్రోత్సాహంతో నటించేందుకు అంగీకరించినట్లు చెప్పారు.
ఇక తనపై వచ్చే ట్రోల్స్ గురించి కూడా సమంత స్పందించారు. కాలం తనకు ఎన్నో విషయాలు నేర్పిందని, గతంతో పోలిస్తే ఇప్పుడు అనవసరమైన వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవడం లేదని తెలిపారు. తాను సంతోషంగా ఉండటానికి కారణాలను, సాధించాలనుకున్న లక్ష్యాలను గతంలో డైరీలో రాసుకునేదానినని చెప్పారు. జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాని కోసం ముందుకు సాగుతున్నప్పుడు ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోకుండా ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. తన గురించి ప్రతికూలంగా మాట్లాడాలని ఎవరైనా ముందే నిర్ణయించుకుంటే.. తాను ఏం చేసినా వారి అభిప్రాయాన్ని మార్చలేనని అన్నారు. అలాంటి వారిని ఒప్పించేందుకు సమయం వృథా చేయడం కంటే జీవితంలో ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టడం మంచిదని చెప్పారు. గతంలో మానసికంగా బలహీనంగా ఉన్న సమయంలో ట్రోలింగ్ తనను బాధించేదని, ఇప్పుడు మాత్రం వాటి గురించి ఆలోచించడం చాలా వరకు తగ్గిపోయిందని సమంత తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!