

థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు మధ్యలో ‘ఇంటర్వెల్’ అంటూ విరామం రావడం ప్రేక్షకులకు సర్వసాధారణం. సాధారణంగా కథలో కీలకమైన మలుపు తర్వాత వచ్చే ఈ బ్రేక్.. ప్రేక్షకుల్లో ఉత్కంఠను మరింత పెంచుతుంది. అయితే సినిమా మధ్యలో ఇంటర్వెల్ ఎందుకు వస్తుందనే విషయం చాలామందికి తెలియదు. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కొనుగోలు చేసేందుకు మాత్రమే ఈ విరామం తీసుకురాలేదు. ఒకప్పుడు సినిమాలను డిజిటల్ టెక్నాలజీతో కాకుండా ఫిల్మ్ రీళ్లను ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించేవారు. ఒక రీల్ పూర్తయిన తర్వాత మరో రీల్‌ను ప్రొజెక్టర్‌లో అమర్చేందుకు కొంత సమయం పట్టేది. సాధారణంగా ఈ ప్రక్రియకు 10 నుంచి 15 నిమిషాల సమయం అవసరమయ్యేది. ప్రేక్షకులను ఆ సమయంలో ఖాళీగా కూర్చోబెట్టకుండా విరామం ఇచ్చేవారు. అలా సినిమాల్లో ఇంటర్వెల్ సంప్రదాయం ప్రారంభమైంది.
కాలక్రమేణా ఫిల్మ్ రీళ్ల స్థానంలో డిజిటల్ ప్రొజెక్షన్ అందుబాటులోకి రావడంతో రీళ్లు మార్చాల్సిన అవసరం లేకుండా పోయింది. అయినప్పటికీ ప్రేక్షకులకు అలవాటైన ఇంటర్వెల్‌ను కొనసాగించారు. క్రమంగా అది సినిమా ప్రదర్శనలో ఒక భాగంగా, భారతీయ సినిమా సంస్కృతిలో ప్రత్యేకమైన సంప్రదాయంగా మారింది. అయితే ప్రస్తుతం ఈ విరామం థియేటర్ యాజమాన్యాలకు అదనపు ఆదాయ వనరుగా మారిందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇంటర్వెల్ సమయంలో ప్రేక్షకులు పాప్‌కార్న్, చిప్స్, సమోసా, కూల్‌డ్రింక్స్ వంటి వాటిని కొనుగోలు చేస్తుంటారు. ఒకప్పుడు తక్కువ ధరకు లభించిన ఈ తినుబండారాలు ఇప్పుడు థియేటర్లలో అధిక ధరలకు విక్రయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వాటర్ బాటిల్‌కు కూడా ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తోందని ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంతో కలిసి సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు టికెట్లతో పాటు స్నాక్స్, డ్రింక్స్, ఇతర ఖర్చులు కలిపి సింగిల్ స్క్రీన్‌లో మధ్యతరగతి కుటుంబానికి సుమారు రూ.1,500 నుంచి రూ.2,000 వరకు ఖర్చవుతున్న పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఒకప్పుడు రీల్ మార్చేందుకు అవసరమైన సాంకేతిక విరామంగా ప్రారంభమైన ఇంటర్వెల్.. ఇప్పుడు ప్రేక్షకులకు అదనపు ఖర్చుగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!