

రెమ్యునరేషన్ ఎంత పెంచినా సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌కు రావడానికి నయనతార సాధారణంగా ఆసక్తి చూపరనే విషయం తెలిసిందే. సినిమా సైన్ చేసే ముందే ప్రమోషన్లకు హాజరు కాలేనని స్పష్టం చేసి, అందుకు నిర్మాతలు అంగీకరిస్తేనే ఒప్పందం చేసుకుంటారని ప్రచారం ఉంది. అయితే శ్రీరామరాజ్యం సమయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపించింది. బాపు దర్శకత్వం, ప్రభుదేవాతో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన, అదే తన చివరి సినిమా కావచ్చనే భావనతో ఆమె ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ వంటి చిత్రాలకు దూరంగా ఉన్నారు. అయితే నిర్మాతగా మారిన తర్వాత ప్రమోషన్స్ విలువ నయనతారకు తెలిసొచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
నయనతార నిర్మాతగా వ్యవహరించిన కనెక్ట్ కోసం తెలుగు, తమిళం అనే తేడా లేకుండా పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. సొంత సినిమాకు ఒకలా, ఇతర చిత్రాలకు మరోలా వ్యవహరిస్తున్నారంటూ అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత చర్మ సంరక్షణ ఉత్పత్తులకు ప్రచారం చేస్తూ వరుస ప్రకటనల్లో కనిపించారు. ‘మన శంకర వరప్రసాద్’ ప్రమోషనల్ ఈవెంట్స్‌కు రాకపోయినా షూటింగ్ మొదటి రోజు, చివరి రోజు వీడియోలతో అభిమానులను ఆకట్టుకున్నారు. తాజాగా టాక్సిక్ ట్రైలర్ లాంచ్‌లో నయనతార కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. యష్ స్వయంగా ఫోన్ చేయడంతో రాలేనని చెప్పలేక వచ్చానని ఆమె వెల్లడించారు. ఇంటర్వ్యూలకు కూడా దూరంగా ఉండే నయనతార టాక్సిక్ ప్రచారంలో పాల్గొంటుండటంతో ఇకపై ఆమె ప్రమోషన్ల విషయంలో మరింత మార్పు కనిపిస్తుందా అనే ఆసక్తి నెలకొంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!